ముద్రగడ .పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నా ఈ విషయం బయటకు రాకుండా కొడుకు గిరి ప్రయత్నిస్తున్నాడా? అంటే అవునని అంటున్నారు కూతురు క్రాంతి. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడో కూడా ఆమె బైటపెట్టారు.
Mudragada Padmanabham : కాపు ఉద్యమనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ క్యాన్సర్ బారినపడ్డారని ఆయన కూతురు క్రాంతి ప్రకటించారు. తండ్రి ఆరోగ్యం ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసారు.
తన తండ్రి ముద్రగడ ఆరోగ్యం క్యాన్సర్ కారణంగా క్షీణిస్తున్నా సరైన వైద్యం అందించడం లేదంటూ సోదరుడిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చివరకు సొంత కూతురినైన తనను కూడా తండ్రిని కలిసేందుకు… ఆరోగ్యం ఎలావుందో తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ క్రాంతి ఆవేదన వ్యక్తం చేసారు.
''నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఆయన అత్యవసర వైద్యం అవసరం.. కానీ సోదరుడు గిరి అందనివ్వకుండా చేస్తున్నాడు. ఇది అత్యంత బాధాకరం. కనీసం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలియజేయడం లేదు'' అంటూ క్రాంతి తన బాధను వ్యక్తం చేసారు.
''తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనతో ఇటీవల ఓ వైసిపి మాజీ ఎమ్మెల్యే ద్వారా కలిసే ప్రయత్నం చేసాను. కానీ తన సోదరుడు గిరి, అతడి మామ అందుకు అనుమతించలేదు. కేవలం తనకే కాదు కుటుంబసభ్యులు, సమీప బంధువులు, తండ్రి సన్నిహితులు, అభిమానులకు కూడా ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం ఇవ్వడంలేదు'' అని తెలిపారు.
''నాకు తెలిసిన సమాచారం ఏంటంటే గిరితో పాటు అతడి అత్తారింటివారు తండ్రి ముద్రగడను నిర్బంధించారు. అతడిని ఒంటరిగా ఉంచుతున్నారు.. ఎవరినీ కలవనివ్వకుండా చూస్తున్నారు'' అంటూ అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని మరింత కృంగిపోయేలా చేస్తున్నారని క్రాంతి ఆరోపించారు.
''గిరి... ఇది అమానవీయమే కాదు అస్సలు అంగీకరించరానిది. రాజకీయ కారణాలతో నువ్వు ఇలా చేస్తున్నావని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ నీ తీరును నేను సహించను… నిన్ను అస్సలు వదిలిపెట్టను. మన తండ్రికి తగిన గౌరవం, మంచి సంరక్షణ అవసరం. కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి పారదర్శకంగా సమాచారం అందించాలి'' అని సోదరుడిని హెచ్చరించారు క్రాంతి.

