ఇక ప్రత్యేక హోదా డిమాండ్ తో చంద్రబాబు నాయుడి మీద దాడి
కాపు రిజర్వేషన్లనుంచి తన పోరాటాన్ని మాజీ మంత్రి ముద్రగడపద్మనాభం విస్తరిస్తున్నారు. ఇపుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కూడా ఎలుగెత్తాలనుకుంటున్నారు. కాపు పోరాటం అన్నపుడల్లా ఆయన మీద నిర్భంధం విధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం బయట పర్యటించకుండా అడ్డుకుంటున్నందు వల్ల ఆయన ఇపుడు విశాలఆంధ్రరాష్ట్ర సమస్య లేవనెత్తి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తలపడాలనుకుంటున్నారు. ఈ సమస్య మీద ఆయన మీద ఆంక్షలు విధించడం కష్టమని,అందువల్ల పర్యటనలు కొనసాగించడం సులువువుతుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కేవలం కాపు రిజర్వేషన్ల పోరాటానికి పరిమితమయి పోవడంతో ప్రత్యర్తులు అయనను కాపు నాయకుడనో కిర్లంపూడి నాయకుడనో అంటూ వచ్చారు. ఇపుడు ఆయన తన పోరాట పరిధిని పెంచుతున్నారు.
ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కూడా కాపులు పోరాడాలని ఆయనఅభిప్రాయపడతున్నారు. దీనికోసంఒక ఐక్య పోరా టానికి అంతా సిద్ధం కావాలని కాపు నేతలకే కాకుండా పలు పార్టీల నేతలకు, సినీ ప్రముఖు లకు లేఖ రాశారు.
ఈ లేఖలను ఆయన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు, వామపక్షాలకు, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవి, మోహన్‌బాబుతో పాటు పలువురు నేతలకు లేఖలు రాశారు.
’అన్ని వర్గాల ప్రజలు కలసి పోరాడితే ప్రత్యేక హోదా దక్కడం కష్టం. బాధ్యతగల సీఎం మూడేళ్ల కాలంలో పలుమార్లు హోదాపై మాట మార్చారు. ఇది విచారకరం. దీనివల్లే ఇపుడు సమైక్య పోరాటం అవసరమవుతున్నదని,‘ అని ఆయన అన్నారు.
