నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడం, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం


దిశ హత్యకేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిందితులను ఎన్ కౌంటర్ చేసినందుకు గాను...తెలంగాణ పోలీసులను జగన్ అభినందించారు. సీఎం కేసీఆర్ ని శెబాష్ అంటూ మెచ్చుకున్నారు. కాగా... జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

దిశ రెడ్డి కాబట్టే.. జగన్ ఇలా స్పందించారంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ తమ సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద స్పందిస్తున్నారని ఆయన విమర్శించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగితే ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ‘‘నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడం, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం. హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, మృతదేహాలను బావిలో పడవేసిన శ్రీనివాసరెడ్డిని, జడ్చర్లలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన నవీన్‌ రెడ్డినీ ఎన్‌కౌంటర్‌ చేయాలని సూచించే సాహసం జగన్‌ చేయగలరా? ’’ అని ప్రశ్నించారు.

‘‘ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు.నలుగురు మహిళలను చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయరు?’’ అని మంద కృష్ణ ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో 11 మంది గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారాలకు పాల్పడి హత్యలు చేశారని చెప్పారు.

 ఆయేషామీరా హత్య కూడా వైఎస్‌ హయాంలోనే జరిగిందని, ఆమె తల్లిదండ్రుల ఆవేదన ఇప్పటికీ అరణ్య రోదనగానే మిగిలిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో తల్లి కూతుళ్లను హత్య చేసి తగులబెట్టారన్నారని ఈ కేసుల్లో కేసీఆర్‌ పాలసీని జగన్‌ అమలు చేయగలరా అని ప్రశ్నించారు. ‘‘ఆర్థిక నేరగాళ్లపై తక్షణమే న్యాయ విచారణ జరిపించి, నేరం రుజువైతే ఉరిశిక్ష విధించేందుకు జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయగలదా? కేంద్రం ఆ చట్టం చేస్తే సమర్థించే దమ్ము జగన్‌కు ఉందా?’’ అని మంద కృష్ణ ప్రశ్నించారు.