తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా.. దాదాపు 90 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతోంది. దాదాపు టీఆర్ఎస్ విజయం ఖాయమైనట్టే. కాగా.. ఈ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. మహాకూటమి ఓటమిపై.. చంద్రబాబుని విమర్శిస్తూ.. కామెంట్ల వర్షం కురిపించారు.

‘‘కేటీఆర్ చక్కగా ఎనలైజ్ చేశాడు. మీడియా, డబ్బుతో ఏదైనా చేయొచ్చన్న భ్రమలో ఉంటాడు చంద్రబాబు. ప్రజలు మిమ్మల్ని చూస్తేనే భయపడుతుంటే మీడియా, మీరు నమ్ముకున్న నోట్ల కట్టలు గెలిపించలేవు. తాచెడ్డ కోతి వనమెల్ల చెడినట్టు తెలంగాణా కాంగ్రెస్ ను నిండా ముంచుతున్నాడు పెద్ద నాయుడు.’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

‘‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుంది చంద్రబాబు పరిస్థితి. ఐటి, ఇడి తన అక్రమాల గుట్టును ఎక్కడ బయట పెడతాయోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. రోలు వచ్చి మద్దెలకు చెప్పుకున్నట్టు ఈయన గుంపు కట్టించిన వారందరిపైనా కేసులు ఉన్నాయి. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబుగారు.’’ అని మరో ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో..‘‘తెలంగాణ ప్రజానీకం తిరుగులేని తీర్పుతో సైకిల్‌కు ముందు చక్రం ఊడిపోయింది. నాయుడుబాబుకు చావుతప్పి కన్నులొట్టబోయింది. సైకిల్‌ వెనుక చక్రం కూడా పీకి చంద్రబాబు పీడను ఎంత త్వరగా ఒదిలించుకోలా అని ఆంధ్ర ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారు.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇక మరో ట్వీట్ లో.. ‘‘తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా....
1)చంద్రబాబు నాయుడు
2)బాలకృష్ణ
3)లగడపాటి రాజగోపాల్
4)ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ
5)ఈనాడు-ఈటీవి రామోజీ
6)మునుగుతున్న చంద్రబాబు తోకపట్టుకుని ఈదటానికి ప్రయత్నించిన కాంగ్రెస్.’’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.