అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికన ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలు, రాష్ట్రం కోసం పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం కుటుంబం, తన వారికోసం ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. 

''బాబు అనుభవం అంతా... రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా గ్రాఫిక్స్‌లో చూపెట్టి, రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు తొక్కి పెట్టి, సొంత ప్రయోజనాలు ముందు పెట్టి, రాష్టానికి తెచ్చింది ఏంటయ్యా అంటే నీరూ మట్టి...అందుకే జనాలు నిన్ను కూర్చోపెట్టారు ఓడగొట్టి...'' అంటూ చంద్రబాబుపై ప్రాసతో కూడిన విమర్శలు చేశారు.  

''ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది?చంద్రబాబుది- తన కోసం, తన వారి కోసం ఆరాటం. జగన్ గారిది- వందల కులాలు, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతర పోరాటం'' అని విజయసాయి పేర్కొన్నారు. 

''విమర్శలు నమ్మశక్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే లాజిక్ ను చంద్రబాబు గారు ఎప్పుడో గాలికొదిలారు. సిఎంగా జగన్ గారు చేసింది శూన్యమంట. ఈయన పథకాలనే పేరుమార్చి అమలు చేస్తున్నాడట. గ్రాఫిక్స్ హోరు తప్ప తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్ స్కీముల పేర్లు చెప్పండి బాబూ?'' అంటూ వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు విజయసాయి.