ఆంధప్రదేశ్‌లో గురువారం నుంచి కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ నిలిచిపోతుంది. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. 

ఆంధప్రదేశ్‌లో గురువారం నుంచి కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ నిలిచిపోతుంది. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో విద్యుత్ ఉత్పాదనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పీలో త్వరలోనే కరెంట్ కష్టాలు తీరనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు.

కరెంట్ కష్టాలపై రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి 1,208 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి వివరించారని ఆయన తెలిపారు. అయితే ఇవి దేశీయంగా తయారైన రియాక్టర్లు కాకపోయినా ఏపీలో నెలకొన్న విద్యుత్ అవసరాలు తీర్చుతాయన్న నమ్మకం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. 

ఇదిలా ఉంటే..ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) షాక్ ఇచ్చింది. ఏపీకి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఎన్టీపీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎన్టీపీసీ నిలిపివేసింది. ఎన్టీపీసీకి రాష్ట్ర డిస్కంలు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటికోసం లేఖలు రాసినప్పటికీ.. డిస్కంల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యుత్‌ను నిలిపేసినట్లు ఎన్టీపీసీ వర్గాలు తెలిపాయి.

అంతేకాకుండా ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్‌లో కొనేందుకూ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేసినట్టుగా సమాచారం. అందుకే ఏపీలో డిస్కంలు రెండు రోజులుగా కోతలు విధించాయి. ఒక్కసారిగా పడిపోయిన విద్యుదుత్పత్తితో రాష్ట్రంలో సరఫరాకు తీవ్ర ఇబ్బంది నెలకొంది.