ఢిల్లీ: టీడీపీ ఎంపీ కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఈడీ అధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో రెండు రోజులపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సుజనా చౌదరిని విచారించారు. ఆ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తనకు ఆహారం కూడా ఇవ్వలేదని సుజనా ఆరోపించారు. తనకు భోజనం పెట్టలేదంటూ ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. 

ఇటీవలే ఈడీ అధికారులు చెన్నైలోని తన కార్యాలయంలో రెండురోజులపాటు సుజనా చౌదరిని విచారించారు. విచారణ విరామ సమయంలో భోజనం ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారని సుజనా ఆరోపించారు. ఉదయం పదకొండన్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తనను అధికారులు విచారించారని, ఇలా వరుసగా రెండు రోజుల పాటు సాగిందని పేర్కొన్నారు. 

సుజనాచౌదరి ఆరోపణలపై స్పందించిన న్యాయమూర్తి ఆహారం ఇవ్వకపోవడం నిజమే అయితే అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. అయితే సుజనా చౌదరి ఆరోపణలను ఈడీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. ఆహారం అందజేయబోతే తిరస్కరించారని కేవలం అరటిపండు మాత్రం తిన్నారని కోర్టుకు వివరించారు. 

అయితే సుజనా చౌదరి తరపు న్యాయవాది స్పందిస్తూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని వీటిపైకూడా అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సుజనా చౌదరి దాఖలుచేసే అఫిడవిట్‌కు స్పందించాలని ఈడీ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

ఇకపోతే బ్యాంకులకు రూ.6000 కోట్ల మేర రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ కేసు విచారణ జరిగింది.     

ఎంపీ సుజనాచౌదరి విదేశాలకు నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల వంటి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. అందులో భాగంగా బ్యాంకులకు రుణాల ఎగవేతపైనే ఈడీ అధికారులు సుజనాను రెండురోజులు ప్రశ్నించి సమాచారం సేకరించారు.  
 
120 డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా నిధుల తరలింపు వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సుజనాను పలు కోణాల్లో ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. 

అయితే బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు సుజనాచౌదరి 126 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీల ద్వారా రూ.6వేల కోట్లు రుణాలు తీసుకుని ఆ నగదును షెల్ కంపెనీల ద్వారా బినామీ సంస్థలకు బదలాయించారని ఈడీ గుర్తించినట్లు సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

రుణాల ఎగవేత కేసు: రెండోరోజు సుజనాను విచారించిన ఈడీ