గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్మిక మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను అధికారులు హాస్పిటల్ నుండి జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులు జైలువద్దకు చేరుకున్నారు. 

తన బాబాయ్ అచ్చెన్నాయుడి పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రామ్మోహన్ నాయుడు ఖండించారు. ఆయనపై కావాలనే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజంగా ఆయన ఆరోగ్యం బాగుండి డిశ్చార్జి చేస్తే వీల్ చైర్ లో, అంబులెన్స్ లో జైలుకు ఎందుకు తరలించాని రామ్మోహన్ ప్రశ్నించారు. 

ఎర్రన్నాయుడి కుటుంబమే జగన్ టార్గెట్... ఎందుకంటే: యనమల

''డాక్టర్లు అసలు ఏం రిపోర్ట్ ఇచ్చారు.  రేపు బెయిల్ వస్తుందని ఈ రోజు అర్జంట్ గా ఆయనను జైలుకు తరలించారు. సీఎం జగన్ కావాలనే తమ(కింజరాపు) కుటుంబం పై కక్ష సాధిస్తున్నారు.రాజకీయంగా మా కుటుంబాన్ని ఎదురుకోలేక ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు'' అని అన్నారు. 

''జగన్ అవినీతి పై కింజరపు కుటుంబం గతంలో కేసులు వేసింది. ఫ్యాక్షన్ మనస్తత్వం గల జగన్ వాటిని గుర్తు పెట్టుకుని ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష్య సాధిస్తున్నారు. అయినప్పటకి ఆయనకు బయపడేది లేదు. మా కుటుంబానికి ప్రజల అండ ఉంది'' అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.