మా చెల్లికి పెళ్లి... జరగాలి మళ్ళీ మళ్లీ అన్నట్లుంది జగన్ తీరు: మరో లేఖలో రఘురామ ఎద్దేవా
నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ఎంపి రఘురామ సీఎం జగన్ కు ఇప్పటికే తొమ్మిది లేఖలు రాయగా నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.
న్యూడిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ఆయన ఇప్పటికే తొమ్మిది లేఖలు రాయగా నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మంగళవారం పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ మాటిమాటికి శంకుస్థాపనలు చేయడంపై రఘురామ ఎద్దేవా చేశారు.
''2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది మన ప్రభుత్వ సంకల్పం. 17వేల కాలనీల్లో 31లక్షల కుటుంబాలకు రూ.56వేల కోట్లతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చివరకు రూ.70వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇప్పుడు మళ్లీ జులై 4న శంకుస్థాపన అంటున్నారు. ఇలా విడతల వారిగా శంకుస్థాపనలు చేయడం యమలీల సినిమాలో మా చెల్లికి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా వుంది'' అంటూ ఎంపీ రఘురామ సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు.
read more జగన్ కి రఘురామ మరో లేఖ.. 146 జీవో పై ఆగ్రహం..!
''మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో మెరుగైన సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇచ్చినా చాలా ప్రాంతాల్లో ఆ ఇళ్లలో ప్రజలు నివసించడం లేదు. కాబట్టి ఇళ్లు నిర్మించే ముందు కనీస సౌకర్యాల కల్పన కూడా చూసి ఉంటే బాగుండేది. ఇక కాంట్రాక్టర్లు నాసిరకం నిర్మాణ సామగ్రితో ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణాలు బలంగా ఉండకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా బెడ్ రూం వైశాల్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి'' అని రఘురామ కోరారు.