మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జైల్లో కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు.  జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వ మనుగడకు మంచిది కాదని పేర్కొన్నారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడానికి ఎవరు కారకులని ఆయన ప్రశ్నించారు. కక్షలు, కార్పణ్యాల కార్ఖానాగా ప్రభుత్వం మారిందన్న అపవాదు వస్తుందన్నారు.

ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో వినాయక చవితి వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే వినాయక మండపాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 

కాగా.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫోన్ టాపింగ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమౌతున్న సంగతి తెలిసిందే. పలువురి ఫోన్లు ట్యాపింగ్ గురి అయ్యాయంటూ.. ఇప్పటికే రఘురామ కృష్ణం రాజుతోపాటు.. చంద్రబాబు కూడా ఆరోపించారు. దీనిని వీరు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాగా.. ఈ వ్యవహారం కేంద్ర పరిధిలో రాదంటూ జీవీఎల్ పేర్కొన్నారు.

కాగా.. జీవీఎల్ కామెంట్స్ పై కూడా రఘుురామకృష్ణం రాజు స్పందించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం పరిధిలోకి రాదని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రకటించడం అసంబద్ధంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నానని రఘురామ అన్నారు. ఓ జాతీయ పార్టీకి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉండదని అన్నారు.