నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వైసీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఆ పార్టీ గుర్తుపై గెలిచి.. ఆ పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ఆ పార్టీపై విమర్శలు చేసిన ఆయన.. తాజాగా.. మరోసారి విరుచుకుపడ్డారు. 

తనని కొందరు బెదిరిస్తున్నారని... వారిని ఓ అదృశ్య శక్తి నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.  ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి సమావేశం అయిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నాడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ని గుర్తు చేశారు.

దుష్ట చతుష్టయం అంటూ విజయసాయి ట్వీట్‌ చేశారని, ఫేస్ టైమ్ అంశాన్ని కూడా దానిలో ప్రస్తావించారన్నారు. ఫేస్ టైమ్‌లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరని విజయసాయి ట్వీట్ చేశారన్నారు. హిచ్ కాక్ సస్పెన్స్ సినిమాలా ఇలా పెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంటే మొత్తం అన్నీ ట్యాప్ చేసి వింటున్నారని చెప్పకనే చెప్పారా? లేదా భయానికి గురి చేస్తున్నారా? లేక నిజంగానే జరుగుతోందా? ఈ విషయాన్ని విజయసాయి కన్ఫామ్ ఎలా చేశారని ప్రశ్నించారు. ట్యాపింగ్ ద్వారా తెలిసిందన్న అనుమానం సామాన్యుల్లో నెలకొందన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.     

న్యాయ వ్యవస్థపై టెలిఫోన్ నిఘా అన్నది రుజువైతే ప్రభుత్వానికి మచ్చ అని, ప్రభుత్వంలో ఏ ఒక్కరు తప్పు చేసిన సీఎంగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తతో ఉండాలని సూచించారు. ‘‘నాకు టైమ్ ఇస్తే నేనే చెబుతా.. రచ్చబండలో చెబితే బాగుండదు... ట్యాపింగ్‌తో మీకు సంబంధం లేదన్న విషయం అందరికీ తెలుసు.. కానీ సంబంధిత వ్యక్తులు ఎవరన్నదానిని తేల్చాలి’’ అని కోరారు.