సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్‌కు నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవేంతం చేయాలని రఘరామ కృష్ణరాజు ఆ లేఖలో కోరారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్‌కు నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవేంతం చేయాలని రఘరామ కృష్ణరాజు ఆ లేఖలో కోరారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి జైలు లోపల, బయట ఉన్న నిందితులకు, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆయన సీబీఐ చీఫ్‌ను కోరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని రఘురామ కృష్ణరాజు లేఖలో కోరారు. ఈ కేసులో సీబీఐ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించిన సీబీఐ అధికారులు.. లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టుగా చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి పలువురు ప్రముఖులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే శనివారం మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణరాజు.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినదానికి.. ఖర్చు చేసిన దానికి సంబంధంలేదని విమర్శించారు. ప్రభుత్వం చెప్పినదానికి సంబంధం లేకుండా జరుగుతోందంటే... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందన్నారు. ఆర్థిక అరాచకానికి పరాకాష్టని అన్నారు. దీన్ని ఆర్థిక ఉన్మాదం అంటారా? ఆర్థిక తీవ్రవాదం అంటారా? ఆర్థిక అనావృష్టి అంటారా? ఏమంటారని ఆయన ప్రశ్నించారు.
