విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ జీవీల కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
విశాఖపట్నం: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ జీవీల కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీ ఎంవీవీ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ కిడ్నాప్ పక్కా పథకం జరిగిందని అన్నారు. కిడ్నాపర్లు తన కుటుంబ సభ్యులు దారుణంగా హింసించారని చెప్పారు.
మూడు రోజులుగా రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని.. ఈ ఘటనకు సంబంధించి హేమంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారని తెలిపారు. హేమంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తన ఫోన్ కాల్స్ రికార్డు తీసుకోవచ్చని చెప్పారు. కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ హేమంత్ గురించి మాట్లాడకుండా.. ఇతర అంశాలపై మాట్లాడటం బాధకరమని అన్నారు. కిడ్నాప్ వెనక రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఏమి లేవని చెప్పారు.
ఏ ప్రభుత్వంలోనైనా చిన్ని చిన్న ఘటనలు జరుగుతాయని.. విశాఖలో నేరాలు, ఘోరాలు జరిగిపోవడం లేదని చెప్పారు. తనకు వైజాగ్ వదిలి వెళ్లిపోవాలనే ఆలోచన రావడానికి కారణం మీడియానేనని ఆరోపించారు. తాను గతంలో వ్యాపారం చేసినప్పుడు ఏ ఇబ్బంది లేదని.. ఎంపీ అయిన తర్వాత ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌కి షిప్టు అవుతున్నట్టు పేర్కొన్నారు.
కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిగితే తాను సహకరిస్తానని కూడా చెప్పారు. ఈ నెల 12వ తేదీ నుంచి కిడ్నాపర్లు పట్టుబడ్డ వరకు జరిగిన ఎపిసోడ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని అన్నారు.
