విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ల పరంపర ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిన నాటి  నుంచి కేశినేని సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తాను చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలోనే తెలియజేస్తున్నారు. ఇప్పటికే జగన్, బుద్ధా వెంకన్న, వైసీపీ నేత పీవీపీ వంటివారందరినీ తన పోస్టులతో కంగారు పెట్టించిన కేశినేని.. తాజాగా ఏపీ డీజీపీని ఉద్దేశించి పోస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఉద్దేశిస్తూ... కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి కొన్ని సూచనలు చేశారు. ‘‘ డీజీపీ గారు కాల్ మనీ మాఫియా వల్ల ప్రజలు  పడే ఇబ్బందులు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. కాల్ మనీ మాఫియా బారిన పెద్ద ప్రజలు పడకుండా కాపాడండి సార్’ అంటూ పోస్టు చేశారు. 

కాగా... ఈ పోస్టు పలువురిని ఆలోచనకు గురి చేసింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితులు టీడీపీ నేతలేనంటూ అధికార వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కేశినేని ఇలా ట్వీట్ చేయడం టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టడానికేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.