స్టీల్ ప్లాంట్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఎంపి జీవిఎల్ నరసింహారావు ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్నా కూడా కడపకు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ఫ్లాంట్ ఇవ్వలేదంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ పై జివిఎల్ ట్విట్టర్ ద్వారానే స్పందించారు. 

జీవిఎల్ ఈ విధంగా ట్వీట్ చేశారు. "ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్" కు శంకు స్థాపన చేసి చంద్రబాబు గారు మరొక డ్రామా ఆడారు. రాయేగా పోయిందేముందని వేసేసారు. ఇటు వంటి అమలుకు నోచుకోని "చంద్రన్న రాళ్లు" రాయలసీమలో చాల వున్నాయి. అసలు గనుల వివరాలను అధ్యయనం చేయకుండా, పొందుపరచకుండా సీమ ప్రజలను మరొక సారి మోసం చేస్తున్నారు.     

చంద్రబాబు పాలనలో పని తక్కువ. మోసం,ఆర్భాటం ఎక్కువ. స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పేవన్నీ అబద్ధాలే. ఒక రాయి పడేసి రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు పెద్ద బిల్డ్ అప్ ఒకటి. టాస్క్ ఫోర్స్ లో 17 డిసెంబర్ ఇవ్వని వివరాలు,కేంద్రం లేఖ @ncbn మోసానికి ఆధారాలు. వీటిపైన పని చేయకుండా శంకుస్థాపన డ్రామానే'' అంటూ జీవిఎల్ పేర్కొన్నారు. 

అంతకు ముందు చంద్రబాబు ''విభజన చట్టంలో ఉన్నా కూడా కడపకు స్టీల్ ఫ్లాంట్ ఇవ్వలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో కడపలో స్టీల్‌ ప్లాంట్‌కు శంకు స్థాపన చేసి, పూర్తిచేసే బాధ్యత తీసుకుంది" అంటూ ట్వీట్ చేశారు. దీనికి జీవిఎల్ పైవిధంగా సమాధానం చెప్పారు.  

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా పట్టుదలతో, ఉక్కు సంకల్పంతో అనుకున్నది సాధించామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి సరిపడా అన్ని వనరులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయన్న కేంద్రం పట్టించుకోలేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.