టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ అధిష్టానంపై అలకబూనిన సంగతి తెలిసిందే. విప్ పదవికి ఇస్తామని ఆహ్వానించినా... కేశినేని నాని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో... బుధవారం ఉదయం విషయం తెలుసుకునేందుకు మరో ఎంపీ గల్లా జయదేవ్... కేశినేని నానితో భేటీ అయ్యారు. కాగా...దీనిపై తాజాగా గల్లా జయదేవ్ స్పందించారు.

కేశినేని నానితో భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.నాని, రామ్మోహన్ నాయుడు, తాను మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చారు. తమ మధ్య జూనియర్, సీనియర్ అని తేడా లేకుండా అందరం కలిసి పని చేస్తామన్నారు. కేశినేని నాని టీడీపీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని గల్లా స్పష్టం చేశారు. 

టీడీపీకి, చంద్రబాబు మాటకు కట్టుబడి తామంతా పనిచేస్తామన్నారు. వ్యక్తిగత పనిమీదనే నానిని కలిశానని గల్లా వివరించారు. ఈ భేటీతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎలక్షన్ కౌంటింగ్ మీద ఎక్కువ ఫోకస్ జరిగిందని, ఈ కారణంగానే ముగ్గురికీ ఒకేసారి పదవులు ప్రకటించలేదని తెలిపారు.