తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎస్వీబీసీ చానెల్ వీడియోలను ప్రసారం చేయడానికి ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై శుక్రవారం సాయంత్రం ఓ యాడ్ ప్లే అయిన తర్వాత సినిమా పాటలు ప్రసారం అయ్యారు. దీంతో అక్కడే ఉన్న భక్తులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం బ్రాడ్‌కాస్టింగ్ విభాగం శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) ద్వారా ధర్మ ప్రచారం చేస్తుంటారు. ఈ చానెల్ వీడియోలను టెలికాస్ట్ చేయడానికి తిరుమలలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ఆధ్యాత్మిక వీడియోలు మాత్రమే ప్లే అవుతుంటాయి. కానీ, శుక్రవారం సాయంత్రం ఈ స్క్రీన్‌ల మీద ఆధ్యాత్మిక చింతనకు బదులు హిందీ సినిమాల పాటలు ప్రసారం అయ్యాయి. ఆ పాటలు సుమారు 15 నిమిషాల పాటు ప్రసారం అయ్యాయని స్థానికులు చెప్పారు.
ఈ పాటలు చూసిన భక్తులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై యాడ్స్ ప్లే అయిన తర్వాత సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. భక్తులు షాక్ అయ్యారు. కొందరైతే ఆ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. టీడీపీ, బీజేపీ సహా ప్రతిపక్షాలు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు.

గతంలో ఓసారి ఈ చానెల్ యూట్యూబ్‌లో పోర్న్ లింక్‌లు కనిపించడం దుమారం రేగింది. అప్పటి ఆ అవాంఛనీయ ఘటన మరోసారి గుర్తు చేస్తున్నారు. టెక్నికల్ స్టాఫ్ నిర్వాకంపై చాలా మంది భక్తులు సీరియస్ అవుతున్నారు. 

ఎస్వీబీసీ వీడియోలు ప్రసారం చేసే భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు ప్రసారం కావడంపై టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మా రెడ్డి వివరణ ఇచ్చారు. సెటాప్ బాక్స్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆధ్యాత్మిక వీడియోలకు బదులు సినిమా పాటలు ప్రసారం అయ్యాయని తెలిపారు. అయినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించారని, వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించి మళ్లీ ఆధ్యాత్మిక వీడియోలు ప్లే అయ్యేలా చేశారని వివరించారు.

Scroll to load tweet…

ఎస్వీబీసీలో పోర్న్ సైట్ల లింకులు 2020 నవంబర్‌లో కలకలం రేపాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాల్సిన చోట ఈ రకమైన సైట్లు చూస్తున్నట్టుగా అధికారుల విచారణలో తేలింది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ కు స్పందనగా ఎస్వీబీసీ ఉద్యోగులు శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ పంపాలి. కానీ దీనికి భిన్నంగా ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు భక్తుడికి పోర్న్ సైట్ లింక్ ను పంపాడు.శతమానం భవతి కార్యక్రమానికి తిలకించేందుకు ఈ లింక్ ను ఓపెన్ చేసిన భక్తుడు షాక్ తిన్నాడు. ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసారం కావాల్సిన లింక్ లో పోర్న్ సైట్ దర్శనం కావడంతో ఆయన అవాక్కయ్యాడు. ఈ విషయమై భక్తుడు టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించాడు. ఈ ఘటనకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఈవో జవహర్ రెడ్డిని ఆదేశించారు.