ఆంధ్రప్రదేశ్ లో కొందరు తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పేదరికం కారణంగా తమ బిడ్దలను అమ్ముకున్నామని అధికారులతో తెలిపారు. ఇటీవల శిశు విక్రయాలు జరుపుతున్న రాకెట్ ను ఏపీ పోలీసులు, అధికారులు కలిసి పట్టుకున్నారు. అయితే పిల్లలను ఎందుకు విక్రయించారని తల్లిదండ్రులను అధికారులు అడిగితే వారు ఇలాంటి సమాధానం ఇచ్చారు.  

పేదరికం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది మహిళలు తమ బిడ్డలను అమ్ముకుంటున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏలూరు, మంగళగిరిలో ఇలాంటి రెండు ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. త‌మ వ‌ద్ద డ‌బ్బులు లేక పిల్ల‌ల‌ను పోషించుకునే స్థోమ‌త లేక బిడ్ద‌ల‌ను త‌మ కుటుంబ స‌భ్యులు అమ్ముకున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు గ్రామమైన అశ్వారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును తండ్రి అరుణ్ కుమార్, అమ్మ‌మ్మ గంటా మేరీలు రూ. 2 ల‌క్ష‌ల‌కు ఓ RMP డాక్ట‌ర్ కు అమ్మారు. ఆయ‌న ఆ శిశువును విశాఖపట్నం దంపతులకు రూ. 3 లక్షలకు విక్రయించారు. చివరకు పసికందును అనకాపల్లి దంపతులకు రూ. 5 లక్షలకు అమ్మారు. 

ఈ మొత్తం రాకెట్ లో ఈ ఆర్ఎంపీ డాక్ట‌ర్ కీల‌కంగా ఉన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPO) సూర్య చక్రవేణి తెలిపిన వివ‌రాల ప్రకారం.. చింత‌ల‌పూడికి చెందిన పాప త‌ల్లి గంటా చిల‌క‌మ్మ‌ను ప్ర‌స‌వం కోసం శేషమ్మ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించాల‌ని ఆర్‌ఎంపీ బుజ్జిబాబు ఒప్పించారు. డెలివ‌రీ అయిన త‌రువాత పాప‌ను అక్క‌డి నుంచి తీసుకెళ్లారు. ఈ విష‌యాన్ని పాప త‌ల్లి అధికారికి తెలిపారు. 

‘‘ ఆర్‌ఎంపీ ఆయా ప్రశాంతి, ఆస్పత్రి ఉద్యోగి శ్రీనివాస్‌ల ద్వారా డీల్‌ కుదుర్చుకున్నారు. ఆసుపత్రి యాజమాన్యం డెలివరీ కోసం ₹28,000 ఫీజుగా తీసుకుంది. తల్లికి జనన ధృవీకరణ పత్రం, బిల్లులు ఇవ్వలేదు’’ అని డీసీపీఓ తెలిపారు. ఈ ఘటనపై అశ్వారావుపేట పోలీసులు బుధవారం సుమోటుగా కేసు నమోదు చేశారు. ఈ రాకెట్‌లో ఆర్‌ఎంపీ బుజ్జిబాబుతో పాటు ఆయన భార్య సువర్ణ, ఆయాలు ప్రశాంతి, ఆస్పత్రి సిబ్బంది శ్రీనివాస్, మధ్యవర్తి రాణి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. 

కాగా ఇలాంటి ఘ‌టనే గుంటూరు జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మేడబలిమి మనోజ్ అనే కూలీ తన మూడో కుమార్తె (రెండు నెలల వయస్సు)ను తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మెగావత్ గాయత్రికి రూ. 70 వేలకు విక్ర‌యించారు. ఈ విష‌యాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె.రాంబాబు తెలిపారు. గాయత్రి నల్గొండ జిల్లా లంబాడా దేవాల తాండాకు చెందిన భూక్య నందు అనే వ్యక్తికి ఆ శిశువును రూ.1.20 లక్షలకు అమ్మింది. 

త‌రువాత నందు ఆడబిడ్డను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన షేక్ నూర్జహాన్‌కు రూ.1.87 లక్షలకు విక్రయించాడు. ఆమె హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన బొమ్మడ ఉమాదేవికి శిశువును ఇచ్చింది. మళ్లీ ఆ పసికందును విజయవాడకు చెందిన పడాల శ్రావణికి రూ. 2 లక్షలకు విక్రయించారు. త‌రువాత ఆమె విజయవాడలోని గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మికి శిశువును రూ. 2.20 లక్షలకు అమ్మింది. చివ‌రికి విజయలక్ష్మి ఆ శిశువును ఏలూరుకు చెందిన వర్రె రమేష్‌కు రూ.2.50 లక్షలకు విక్రయించింది. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.పాపను నల్గొండ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరులకు తరలించారు. అయితే ప్రతీ లావాదేవీ వ‌ద్ద శిశువు వద్ద ధర పెరిగింది అని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా రెండు నెలల క్రితం ఏలూరులో రెండు నెలల వయసున్న మరో ఆడబిడ్డను రూ.60 వేలకు విక్రయించారు. పక్కా సమాచారంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ (డబ్ల్యూడీ అండ్ సీడబ్ల్యూ) అధికారులు పాపను రక్షించి ఏలూరులోని శిశు గృహానికి తరలించారు.

మరో కేసులో గతంలో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఓ దంపతులు తమ‌ కుమార్తెను లక్ష రూపాయలకు కొనుగోలు చేశారని దెందులూరు మండలానికి చెందిన స్వాతి అనే మహిళ ఆరోపించింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇంకో ఘ‌ట‌న‌లో అప్పుడే పుట్టిన మగబిడ్డను హైదరాబాద్‌కు చెందిన దంపతులు 30 వేల రూపాయలకు విక్రయించడంతో భీమవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పాప ఏడుపు విన్న ఇరుగు పొరుగు పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ని ఏలూరు డీసీపీవో సీహెచ్. సూర్య చ‌క్ర‌వేణి అన్నారు. 

కృష్ణా జిల్లాలోని తిరువూరు, ముదినేపల్లి, ఎ. కొండూరు, కలిదిండి తదితర ప్రాంతాల్లో ఇంతకు ముందు ఇలాంటి శిశు విక్రయ కేసులు నమోదయ్యాయని కృష్ణా జిల్లా మాజీ డీసీపీవో సీహెచ్‌. విజయ్ కుమార్ తెలిపారు. 

ఆసుపత్రుల్లో ఆయాలు, స్వీపర్లు, బేబీ కేర్‌టేకర్లు, సెక్యూరిటీ గార్డులతో పాటు ఆర్‌ఎంపీలు ఈ శిశు విక్ర‌య రాకెట్ లో కీల‌క పాత్ర పోషిస్తార‌ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సారా) పాలకమండలి సభ్యుడు పి.ఫ్రాన్సిస్ తంబి తెలిపారు. “ ఆయాలు, సంరక్షకులు కుటుంబం ప్ర‌సవం కోసం వ‌చ్చిన మ‌హిళ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీస్తారు. అనంత‌రం శిశువుల అమ్మ‌కానికి తల్లిదండ్రులను ఒప్పిస్తారు. త‌రువాత వారు మ‌ధ్య‌వర్తుల‌కు అలెర్ట్ చేస్తారు. వారు రాకెటర్లకు సమాచారాన్ని అందజేస్తారు. ’’ అని ఆయ‌న తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే బాధ్యతాయుతమైన సంఘాన్ని నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) మాజీ సభ్యుడు వి.గాంధీబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండ‌గా అశ్వారావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ‘శిశువుల విక్రయం’పై విచారణకు ఆదేశించినట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డి.అనుదీప్ తెలిపారు. కాగా మంగళగిరి, అశ్వారావుపేటలో జరిగిన రెండు ‘శిశు విక్రయం’ కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. కేసుల వివరాలను గురువారంలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించింది.