ఆమెకు వివాహమై దాదాపు దశాబ్దం దాటింది. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తతో జరిగిన చిన్న వివాదం ఆమె మనసు దెబ్బతిన్నది. కోపంగా ముగ్గురు బిడ్డలను తీసుకొని పుట్టింటికి చేరింది. అయితే.. భర్తని కాదని ముగ్గురు ఆడబిడ్డలను సాకగలనా అనే అనుమానం ఆమెకు కలిగింది.అంతే.. ముగ్గురితో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పుట్టపర్తి సమీపంలోని పెద్దకమ్మవారి పల్లి దొమ్మరికాలనీకి చెందిన గురుమూర్తి, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమార్తె అరుణమ్మకు కదిరికి చెందిన రమేష్ తో 13ఏళ్ల క్రితం వివాహమైంది. 

Also Read వచ్చేవారం పెళ్లి...పినతల్లి మాటలకు బాధపడి....

వీరికి భవ్య(8), భార్గవి(8), చందన(5) సంతానం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. రమేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా... ఈ మధ్య డబ్బు విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

దీంతో భర్త మీద కోపంతో ముగ్గురు కూతుళ్లను తీసుకొని అరుణమ్మ.. తన పుట్టింటికి చేరింది. ముగ్గురు బిడ్డలను తాను పెంచలనేనే బాధతో చెరువు చూసి వద్దామని చెప్పి కూతుళ్లను తీసుకు వెళ్లింది. ముందుగా అక్కడే ఉన్న బావిలోకి భవ్య, చందనలను తోసేసి.. తర్వాత భార్గవితో కలిసి తానూ దూకేసింది.

దీనిని గమనించిన స్థానికులు వెంటనే బావిలోకి దిగి అరుణమ్మను కాపాడారు. ఆమెతో పాటు భార్గవిని కూడా బయటకు తీశారు. అరుణమ్మ ప్రాణాలతో బయటపడగా.. భార్గవి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ఇద్దరు చిన్నారుల జాడ అసలు తెలియరాలేదు. వారి కోసం గాలిస్తున్నారు. తన చేతులతోనే ముగ్గురు బిడ్డలను చంపుకున్నానంటూ అరుణమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.