అనంతపురం: మూడేళ్ళ కన్న కూతురిపై ఓ కసాయి తల్లి అత్యంత కర్కషంగా ప్రవర్తించింది. తెలిసీ తెలియని వయసులో అమాయకత్వంతో కూతురు అడిగిన ప్రశ్నలు కోపాన్ని తెప్పించడంతో కడుపుతీపిని సైతం మరిచిన ఆ తల్లి దారుణానికి ఒడిగట్టింది. చిన్నారి ఒంటిపై అట్లకాడతో వాతలు పెట్టి అమానవీయంగా ప్రవర్తించింది. ఈ అమానుషం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

అనంతపురం జిల్లా కదిరి  మండలం కందికుంట గ్రామానికి చెందిన ఓ మహిళ మొదటి భర్తతో విడిపోయి కూతురితో కలిసి కొన్నాళ్లు ఒంటరిగా జీవించింది. ఈ మద్యే ఆమె మరో వివాహం చేసుకుంది. అయితే ఇటీవల ఆమె మూడేళ్ల కూతురు తన కన్న తండ్రి ఎవరంటూ ప్రశ్నించింది. తెలిసీ తెలియని వయసులో పాప అడిగిన ప్రశ్నతో చిర్రెత్తిపోయిన ఆ తల్లి కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. 

ఇంట్లో వుండే అట్లకాడతో చిన్నారి ఒంటిపై ఎక్కడపడితే అక్కడ కాల్చింది. దీంతో పాపం చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇలా తల్లి కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించడాన్ని చూసినవారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఐసీడీఎస్‌ సిబ్బంది, పోలీసుల రంగంలోకి దిగి చిన్నారికి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ఇంత కర్కషంగా వ్యవహరించి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.