ఒంగోలు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కుమారుడిని ఓ  తల్లి హత్య చేయించింది. ఐదేళ్లు భరించి చివరకు తన సోదరుడితో కలిసి కిరాయి హంతకులకు సుపారి ఇచ్ిచ కుమారుడిని చంపించింది. నాలుగు నెలల తర్వాత అసాంఘిక శక్తుల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. 

తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసులో హతుడి తల్లిని, మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలం దూబగుంట వద్ద చోటు చేసుకుంది. 

ఎస్పీ సిద్ధార్థ కౌశల్ శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పొన్నలూరుకు చెందిన కుంచాల మల్యాద్రి, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు నరసింహారావు. అతనికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. అయితే, నిత్యం మద్యం సేవిస్తూ భార్యను వేధించేవాడు. దాంతో భార్య నాగలక్ష్మి అతన్ని వదిలిపెట్టి పిల్లలను తీసుకుని హైదరాబాదు వెళ్లింది. ఆరేళ్ల క్రితం అది జరిగింది. 

కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న నరసింహారావు ఆ తర్వాత తన భార్యను తీసుకుని రావాలంటూ తల్లిపై ఒత్తిడి పెడుతూ వచ్చాడు. భార్యను తెస్తావా, నువ్వే కోరిక తీరుస్తావా అంటూ తల్లిపై విరుచుకుపడుతూ వచ్చాడు. కొడుకు ప్రవర్తనతో మనస్తాపానికి గురైన తండ్రి మల్యాద్రి మంచాన పడ్డాడు. దాన్ని అనుకూలంగా మలుచుకుని తల్లిని తన చేష్టలతో మరింతగా వేధిస్తూ వచ్చాడు. 

చాలా కాలం మౌనంగా ఉండిపోయిన లక్ష్మమ్మ కుమారుడి వికృత చేష్టల స్థాయి పెరగడంతో సోదరుడితో మొరపెట్టుకుంది. దాంతో ఇద్దరు కలిసి నరసింహారావు హత్యకు పథక రచన చేశారు. లక్ష్మమ్మ సోదరుడు తన్నీరు మల్యాద్రి పొన్నలూరుకు చెందినవాడు. అతనితో పాటు బంధువు ఉప్పుటూరి రమణయ్య, దర్జీ పనిచేసుకునే చుండి పేరయ్య, వలేటి చినమాలకొండయ్యలు కలిసి తమకు తెలిసిన కందుకూరు మండలం దూబగుంటకు చెందిన షేక్ షరీఫ్, నిమ్మగడ్డ కరుణాకర్, పాలడుగు రాఘరావులతో చర్చించారు. 

నరసింహారావును చంపేందుకు రూ.1.70 లక్షలకు లక్ష్మమ్మతో ఒప్పందం చేసుకున్నారు. కందుకూరు ఓవీ రోడ్డులోని వెంకటాద్రి నగర్ పార్కుకు వెళ్లేదారిలో రాత్రి వేళ కత్తితో పొడిచి నరసింహారావును చంపేశారు. అక్కడే గుంత తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టారు.