మతిస్థిమితం సరిగా లేక ఓ తల్లి తన పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, తానూ తిన్న సంఘటన కృష్ణాజిల్లా, కంకిపాడు మండలంలోని పునాదిపాడులో చోటుచేసుకుంది. ఆత్మహత్యా యత్నం ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని పునాదిపాడు గ్రామానికి చెందిన కనకభవానికి మతిస్థిమితం సరిగా లేదు. కనక భవాని పిల్లలు జ్యోతి ప్రసన్న (7), కుమార్‌ (5). మధ్యాహ్నం సమయంలో పిల్లలిద్దరూ వాంతులు చేసుకోవటాన్ని స్థానికులు గమనించి తల్లి భవానీని ప్రశ్నించారు. 

ఎలుకల మందు తెచ్చి భోజనంలో కలిపి పిల్లలకు పెట్టి తానూ తిన్నానని చెప్పింది. వెంటనే తల్లిని, పిల్లలను వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యసేవలు అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు సమాచారం అందింది. 

ఈ మేరకు ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై.దుర్గారావు తెలిపారు.