వినాయక చవితి వేడుకలు పుట్టింటిలో జరుపుకోవాలని ఎంతో ఆశపడింది. బిడ్డలు ఇద్దరినీ తీసుకొని పుట్టింటికి బయలు దేరింది. కానీ... ప్రమాదవశాత్తు... తల్లీ ఇద్దరు బిడ్డలు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కూనవరానికి చెందిన వెంపా వెంకటలక్ష్మి(28) ఇద్దరు పిల్లలు దేవీ వరప్రసాద్(8), అరిసమ్మ(6)తో కలిసి ఆదివారం తన పుట్టిల్లు కోరుకొండ మండలంలోని కోటి గ్రామానికి బయలుదేరారు. కూనవరం వద్దనే బంటివరేవు కాలువ దాటుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురూ కొట్టుకుపోయారు. ఉదయం అత్తారింటిలో బయలుదేరిన కూతురు ఇంకా ఇంటికి రాలేదని ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు.

వెంటనే ఈ విషయాన్ని అల్లుడికి ఫోన్ చేసి తెలియజేశారు. కాగా... రేవులో కొట్టుకుపోయారని తెలియడంతో గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకున్నారు. రేవులో గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.