దసరా సెలవులకు పుట్టింటికి వెళ్లివస్తుండగా ఘోరం... కర్ణాటక యాక్సిడెంట్ తల్లీకొడుకు దుర్మరణం
బైక్ పై నుండి కిందపడిపోయిన తల్లీ కొడుకుల పైనుండి గ్యాస్ సిలిండర్ల లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రీ కూతూరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది.

అనంతపురం : పిల్లలకు దసరా సెలవులు వుండటంతో పుట్టింటికి వెళ్లింది. పండగను ఆనందంగా జరుపుకుని తిరిగి అత్తవారింటికి వెళుతుండగా దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ల లారీ పైనుండి దూసుకెళ్లడంతో తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోయారు. తండ్రికూతురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు కర్ణాటకలో ప్రమాదానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం లోచర్ల గ్రామానికి చెందిన నరేష్ కు బెంగళూరుకు చెందిన అశ్వినితో కొన్నేళ్లక్రితం పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కూలీగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు నరేష్. దసరా పండగ సందర్భంగా స్కూళ్లకు సెలవులు వుండటంతో అశ్విని బెంగళూరులోని పుట్టింటికి వెళ్లింది.
అయితే దసరా సెలవులు ముగిసి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో భార్యాపిల్లలను తీసుకెళ్లేందుకు నరేష్ బెంగళూరు వెళ్ళాడు. భార్య అశ్విని, పిల్లలు యశ్విన్(7), రక్ష లను తీసుకుని బైక్ పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో బెంగళూరు సమీపంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. గ్యాస్ సిలిండర్ల లారీ అశ్విని, యశ్విన్ పైనుండి దూసుకెళ్లింది. దీంతో తల్లీకొడుకు అక్కడికక్కడే దుర్మరణం చెందగా నరేష్, రక్ష తీవ్ర గాయాలపాలయ్యారు.
Read More పిడుగురాళ్లలో విషాదం... లాడ్జి గదిలో యువతీ యువకుడు సూసైడ్
ముందు వెళుతున్న ఆటో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ కంట్రోల్ కాక దాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో అశ్విని, యశ్విన్ రోడ్డుపై పడటంతో వెనకాల నుండి వేగంగా దూసుకొస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ పైనుండి వెళ్లింది. నరేష్, రక్ష మరోవైపు పడిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.
తల్లీకొడుకుల మృతితో లోచర్లలో విషాద ఛాయలు అలుముకున్నారు. బెంగళూరులో పోస్టుమార్టం అనంతరం అశ్విని, యశ్విన్ మృతదేహాలను లోచర్లకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.