భర్త మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన ఓ భార్య మతిస్థిమితంలేని కుమారిడితో పాటు చనిపోయిన ఘటన గుంటూరుకులో కలకలం రేపింది. పాతగుంటూరు స్టేషన్‌ పరిధిలో నివసించే చాంద్ బీ కుమారుడికి పురుగుమందు తాగించి, తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెడితే..

తమ్మా రంగారెడ్డి నగర్‌ నాలుగో లైనులో పూలవ్యాపారి సయ్యద్‌ అహ్మద్‌ కి ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు కరీముల్లా పెళ్లైంది. వేరుకాపురం పెట్టాడు. రెండో కొడుకు సుభానీ, మానసికంగా ఎదగని మూడో కొడుకు ఎస్థానిలు తల్లిదండ్రులతో పాటే ఉంటున్నారు. 

మూడు నెలల క్రితం సయ్యద్‌ అహ్మద్‌ అకస్మాత్తుగ గుండె జబ్బుతో మృతి చెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య చాంద్‌బీ మానసికంగా కుంగిపోయింది. ‘మీ నాన్న నన్ను పిలుస్తున్నాడు.. మీ నాన్న వద్దకు వెళ్తున్నా’ అంటూ పదే పదే కుమారులతో  చెప్పేది. దీంతో కరీముల్లా తల్లిని, ఇద్దరు తమ్ముళ్లను తన ఇంటికి తీసుకెళ్లాడు. 

ఈ క్రమంలో చాంద్‌బీ మూడో కుమారుడు ఎస్థానీని తీసుకుని బుధవారం తన ఇంటికి వెళ్లిపోయింది. కరీముల్లా, సుభానీ పూల దుకాణానికి వెళ్లిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో సుభానీ  తల్లి ఇంటికి వచ్చాడు. ఎంత సేపటికీ ఆమె తలుపులు తీయలేదు. దీంతో పెద్దన్న కరీముల్లా వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. 

కరీముల్లా తల్లి ఇంటికి వెళ్లగా తలుపు లోపల గడియపెట్టి ఉంది. పక్కన బలహీనంగా ఉన్న మరో తలుపును తెరచి లోపలకు వెళ్లి చూడగా చాంద్‌బీ, ఎస్థాని నురగలు కక్కుతూ అచేతనంగా నేలపై పడి ఉన్నారు. ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.