సోమవారం నాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ 2023-24 సంవత్సరానికి గాను రెండో విడత నిధులను న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.  

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నగదును జమ చేయనున్నారు. వైయస్సార్ లా నేస్తం నిధులను సోమవారం విడుదల చేయనున్నారు. వైయస్సార్ లా నేస్తం పథకం కింద కొత్తగా లా పూర్తి చేసిన యువ లాయర్లకు ఈ నగదు అందనుంది. వారు వృత్తిలో నిలదొక్కుకొనేంతవరకు మూడేళ్లపాటు ఏడాదికి 60వేల చొప్పున రెండు విడతల్లో వైయస్సార్ లానేస్తం సాయం అందిస్తుంది. ఇలా మూడేళ్ల పాటు ఏటా 60 వేల చొప్పున మొత్తంగా రూ. 1,80,000 స్టెఫండ్ ఒక్కొక్కరికి అందుతుంది. 

ఏపీ అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్ సెక్రటరీలు సభ్యులుగా న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును’ రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ద్వారా న్యాయవాదులకు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, వారికి అవసరానికి రుణాలు, ఇతర అవసరాల కోసం దాదాపు రూ.25 కోట్ల ఆర్థిక సాయం ఇప్పటికే అందించారు. దీంట్లో భాగంగానే సోమవారం నాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ 2023-24 సంవత్సరానికి గాను రెండో విడత నిధులను న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

చంద్రబాబు‌లా జగన్‌కు షో చేయడం రాదు.. టీడీపీ వేసే ముష్టి సీట్ల కోసం పవన్ ఆశపడొద్దు : అంబటి రాంబాబు

ఇది జూలై- డిసెంబర్ మధ్య కాలానికి చెందిన సొమ్ము. నెలకు రూ. 5000 రూపాయలు స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. అలా మొత్తంగా ఆరు నెలలకు కలిసి ఒక్కొక్కరికి రూ. 30 వేల రూపాయలు సోమవారం జమ చేయనుంది. ఈ పథకం కింద 2807 మంది జూనియర్ న్యాయవాదులకు సహాయం అందుతుంది. ఒక్కొక్కరికి రూ. 30 వేల చొప్పున 2807 మందికి కలిపి ఎనిమిది కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తంగా రూ.49.51 కోట్లు అందించింది.

ఈ వైయస్సార్ లానేస్తం పథకానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే 1902ను సంప్రదించ వచ్చని అధికారులు తెలిపారు. ఇక ఈ ట్రస్ట్ కింద ఆర్థిక సాయం కావాలనుకునే అడ్వకేట్స్ ఆన్లైన్లో mailto:sec_law@ap.gov.in నేరుగా లా సెక్రటరీ కి అప్లై చేసుకోవచ్చు.