అమరావతి: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే తగిలేలా ఉంది. మాజీమంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు పార్టీ వీడటంతో ఆ పార్టీ గందరగోళానికి గురవుతుంది. రావెల పార్టీ వీడడటంతో ఆ నష్టాన్ని ఎలా భర్తీ చెయ్యాలా అని ఆలోచిస్తున్న తెలుగుతమ్ముళ్లకు మరో షాక్ తగిలింది. 

టీడీపికి చెందిన మరో బిగ్ వికెట్ డౌన్ అవుతుందంటూ వస్తున్న ప్రచారం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సీనియర్ రాజకీయ వేత్త, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుపాల్ రెడ్డి పార్టీ వీడతారంటూ వస్తున్న వార్తలతో ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. 

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం శాసన సభ్యుడిగా కొనసాగుతున్నారు. టీడీపీలో చేరిన కొద్ది రోజులకే మోదుగుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో తప్పదు అన్నట్లుగా పార్టీని అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టేసిన ఆయన ఇక టీడీపీలో ఇమడలేకపోతున్నారని త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.  

వాస్తవానికి మోదుగులకు చాలా కాలంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో సత్సంబంధాలు అంతగా లేవు. పార్టీ విధానాలపైన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన బాహాటంగానే మోదుగుల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాను చెప్పిన పని చెయ్యకపోతే అధికారులను తూర్పారబడుతున్నారు. దీంతో మోదుగుల వైఖరిపై ఇటు పార్టీలోను అటు ప్రభుత్వంలోను చర్చ జరుగుతోంది.

2009 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపిగా గెలుపొందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని 2014 ఎన్నికల్లో చంద్రబాబు బలవంతంగా ఎంఎల్ఏగా పోటీ చేయించారు. తనకు ఇష్టం లేకపోయినా అసంతృప్తితో అధినేత మాట కాదనలేక గెలిచి విజయంసాధించారు. 

అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారని అందువల్లే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు మోదుగుల తన సన్నిహితుల వద్ద చెప్పుకునేవారు. టీడీపీ అధికారంలోకి రావడం, మోదుగుల ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయింది కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు.  

మోదుగులను సీఎం చంద్రబాబు పక్కనపెట్టేశారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మెుదలైంది. తొలిసారి కేబినేట్ లో మంత్రి స్థానం దక్కకపోవడంతో మోదుగుల ఆనాటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ నేతలతో సైతం ఆయన అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలతో సైతం అంతగా సంబంధాలు నెరపడం లేదని టాక్. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు, ఎమ్మెల్యేకు మధ్య చాలా గాప్ వచ్చేసిందని ప్రచారం.  

టీడీపీలో గుర్తింపు లేకపోవడం తాను అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి కావడంతో మోదుగుల ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. తనకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని వచ్చే ఎన్నికల్లోనైనా ఎంపీగా పోటీచెయ్యాలని భావించారు. 

మంత్రి పదవి ఎలాగూ ఇవ్వలేదు కనీసం వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అయినా ఇవ్వాలని చంద్రబాబును మోదుగుల అడిగారట. అందుకు చంద్రబాబు నాయుడు నో చెప్పేశారని తెలుస్తోంది. 
 
పార్టీలో ఎదురవుతున్న వరుస పరాభవాలతో ఇబ్బందులు పడుతున్న మోదుగుల ఇక పార్టీలో ఉండాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగుదేశంపై ప్రజల్లో వ్యతిరేక ఏర్పడిన నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారట. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తనకు టిక్కెట్ ఇస్తారా అన్న అనుమానం కూడా మోదుగులలో ఉందట. పార్టీ టిక్కెట్ వస్తుందా లేదా అని ఆలోచిస్తూ అభద్రతా భావంతో ఉండేకన్నా వైసీపీలోకి వెళ్లిపోవడం మంచిదని భావిస్తున్నారని తెలుస్తోంది. 

తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న మోదుగులను స్థానిక వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరే విషయంపై ఇరు నేతల మధ్య చర్చజరిగింది. ఎమ్మెల్యే మోదుగుల సానుకూలంగా వ్యవహరించడంతో విషయం కాస్త అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి వరకు వెళ్లింది. 

అయితే జగన్ సైతం మోదుగుల చేరికకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే నరసరావుపేట ఎంపీ టిక్కెట్ ఇవ్వనని ఎమ్మెల్యేగానే తిరిగి పోటీ చెయ్యాలంటూ సూచించారట. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి అయితే వైసీపీలో టిక్కెట్ హామీ లభించడంతో ఇక సరే అని చెప్పేశారట. 

జగన్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కన్ఫమ్ చెయ్యడంతో వీలైనంత త్వరలో మోదుగుల పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25 లోపు పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.   

ఇదిలా ఉంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డితోపాటు మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు, ఇటీవలే పార్టీలో చేరికల నేపథ్యంలో తమకు టిక్కెట్ దక్కుతుందో లేదోనని అభద్రతా భావంతో ఉన్న కొంతమంది వైసీపీ వైపు కన్నేశారని తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని అయితే జగన్ కండీషన్స్ వల్లే వెనకడగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే నేతలు ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ కండీషన్స్ పెడుతున్నారట. అంతేకాదు చేరిన ప్రతీ ఒక్కరికీ టిక్కెట్ పై ఎలాంటి హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది వైసీపీలోకి వచ్చేందుకు జంకుతున్నట్లు సమాచారం.