అమరావతి: ఏపీలో ప్రధానమంత్రి మోడీ టూర్‌పై టీడీపీ నేతలు  తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయానికి  క్షమాపణ చెప్పిన తర్వాతే రాష్ట్రానికి రావాలని  టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రధాని టూర్‌పై నిరసనలు వ్యక్తం చేస్తామని టీడీపీ ప్రకటించింది. మోడీ టూర్‌ ఖరారైన నేపథ్యంలో  టీడీపీ నేతలు తమ విమర్శల దాడిని పెంచారు.

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీని అన్ని రకాలుగా ఆదుకొంటామని  తిరుపతిలో  మోడీ హామీ ఇచ్చారు. 

ఆ సమయంలో  ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. కానీ ఏపీకి ఇచ్చిన హామీని అమలు చేయనందుకు నిరసనగా తాము ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది. అదే సమయంలో  కేంద్రంపై అవిశ్వాసాన్ని కూడ ప్రతిపాదించింది.  ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని ఇచ్చిన హామీని కూడ కేంద్రం అమలు చేయలేదని  టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో  ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  

ఏపీలో ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉన్నందున  ఆ పార్టీ  నేతల్లో జోష్ నింపేందుకు గాను జనవరి 6వ తేదీన గుంటూరులో మోడీ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ నాలుగున్నర ఏళ్లలో ఏపీకి ఇచ్చిన నిధుల విషయమై మోడీ ఈ సభ ద్వారా ప్రకటించే అవకాశం లేకపోలేదు.బీజేపీ నేతలు, టీడీపీ నేతలు చెబుతున్న లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉంది.

అయితే ఏపీకి ఇచ్చిన  హామీలను అమలు చేయకుండానే గుంటూరు జిల్లాలో జరిగే సభలో పాల్గొనేందుకు మోడీ రావడంపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని మోడీ గుంటూరుకు వస్తున్నాడని ప్రశ్నించారు.

ఏపీకి చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పిన తర్వాతే గుంటూరు సభలో అడుగుపెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. గుంటూరు సభకు వచ్చే ముందు ఢిల్లీలో ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

మరోవైపు ప్రధాని మోడీ గుంటూరు సభ ద్వారా ఏపీకి ఇచ్చిన నిధులను ప్రకటించే అవకాశం లేకపోలేదు. దీంతో టీడీపీ నేతలు భయపడుతన్నారని  బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే  విభజన హామీలపై మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు బీజేపీ సభకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు టీడీపీ ప్రకటించింది. మొత్తంగా మోడీ సభపై ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం నెలకొంది. విభజన హామీ చట్టం మేరకు కేంద్రం నుండి ఇప్పటి వరకు వచ్చిన నిధుల విషయాన్ని ప్రతి పైసా లెక్కతో సహా వివరించాలని టీడీపీ భావిస్తోంది.