Asianet News TeluguAsianet News Telugu

ఆ భూములు కొట్టేయడానికే భోగాపురం టెండర్ల రద్దు: సోము వీర్రాజు

భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెండర్లను రద్దు చేయడంపై  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర మంత్రికి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.

MLC somu veerraju meets union minister jayant sinha
Author
New Delhi, First Published Aug 21, 2018, 3:22 PM IST


అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెండర్లను రద్దు చేయడంపై  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర మంత్రికి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.

భోగాపురం టెండర్లను ఎయిర్‌పోర్ట్ ఆఫ్ అథారిటీ దక్కించుకొంది. అయితే ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే  టెండర్ల రద్దుపై అవకతవకలు చోటు చేసుకొన్నాయని  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.

ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు.  ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ దక్కితే పనులు అప్పగించకుండా టెండర్ రద్దు చేయడంపై వీర్రాజు అనుమానాలను వ్యక్తం చేశారు.

ఈ విషయమై విచారణ జరిపించాలని  కేంద్రమంత్రి జయంత్‌సిన్హాను ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు.  అయితే భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ రద్దు విషయమై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.  తాజాగా ఈ విషయమై కేంద్ర మంత్రిని సోము వీర్రాజు కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

కేంద్రమంత్రికి భోగాపురం ఎయిర్‌ పోర్ట్ టెండర్ల విషయమై ఫిర్యాదు చేసినా తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం పెద్దు ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు పనులు అప్పగించకుండా టెండర్‌ను రద్దు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. తమకు నచ్చిన ప్రైవేట్‌ సంస్థల కోసం ఇతరులు టెండర్లో పాల్గొనకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 భోగాపురం విమానాశ్రయ టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను పాల్గొనకుండా సీఎం చంద్రబాబు అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజుపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 

ఎయిర్‌పోర్ట్‌ చుట్టు పక్కల ఉన్న భూములు కొట్టేయడానికే  ఆ సంస్థ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారన్నారు . రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో ముడుపులు తీసుకోవచ్చని ఈ టెండర్లను ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎయిర్‌పోర్ట్‌ వ్యయాన్ని రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు. ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టేలా కోర్టులో పిటీషన్లు వేస్తామన్నారు.

ఈ విషయమై కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరో వైపు బీజేపీ, టీడీపీల మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్దం సాగుతోంది. అవకాశం దొరికితే రెండు పార్టీల నేతలు ఒకరిపై మరోకరు విరుచుకుపడుతున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios