కేసులు ఎదుర్కొనేందుకు రాజకీయాల్లోకి రాలేదు: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఆనం ఫైర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. వైసీపీ తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు
నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా ఆధారాలుంటే బయటపెట్టాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ పై ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఆదివారంనాడు ఆయన నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను మంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడేవాడినని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. తమ జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై తాను మాట్లాడినట్టుగా గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించి నిధులు నిలిచిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం లేదని చెప్పినందుకే తనను పక్కన పెట్టారన్నారు. తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్ చార్జీగా పెట్టారని ఆయన చెప్పారు.
తమను విమర్శించే వాళ్లను పార్టీ నుండి తప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ను సాకుగా చూపారని ఆయన విమర్శించారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలను , మంత్రులను గౌరవించేవారన్నారు. కానీ జగన్ పాలనలో ఆ పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ప్రజల అవసరాల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. టీడీపీతోనే తన రాజకీయం మొదలైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా ఎన్నికల కమిషన్ ను చెప్పమనాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. క్రాస్ ఓటింగ్ చేశానో లేదా తాను చెప్పాలన్నారు. కానీ ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సామాన్య విలేకరిగా తనకు తెలుసునన్నారు. విలువలు లేవు కాబట్టే సజ్జల రామకష్ణారెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.. తనపై ఆరోపణలు చేసే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. అధికారుల మెడపై కత్తిపెట్టి పనిచేయడం సరికాదన్నారు..
సీబీఐ, ఈడీ కేసులు ఎదర్కోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ,కుటుంబ సభ్యులను హత్య చేయడానిక తాను రాజకీయాల్లోకి రాలేదని ఆయన పరోక్షంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆయన విమర్శలు చేశారు.
తాను బినామీలు పెట్టుకొని పనులు చేసే అలవాటు లేదని ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీకి చెందిన నేతలపై విమర్శలు గుప్పించారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే అవినీతి ఆరోపణలు చేస్తారా అని వైసీపీ నేతలపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఒకరు ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఈ విషయమై పోస్టుమార్టం నిర్వహించింది వైసీపీ నాయకత్వం. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసింది ఆ పార్టీ . ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు క్రాస్ ఓటింగ్ చేశారనే వైసీపీ నాయకత్వం నిర్ధారించుకుంది. ఈ నలుగురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఈ నెల 24న ఆ పార్టీ ప్రకటించింది. సస్పెన్షన్ పై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ స్పందించారు.