అమరావతి: విదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం సరికొత్త వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. సినిమా విడుదలకు ముందే పెద్ద ప్రచారం అందుకుంటోంది. అయితే రాంగోపాల్‌ వర్మ ఇటీవలే విడుదల చేసిన కుట్ర దగా పాట వెనుక కుట్ర ఉందని టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. 

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన వర్మపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వర్మ తాటాకు చప్పుళ్లకు భయపడమన్న ఆయన మర్డర్‌ కేసులే ఎదుర్కొని వచ్చానని ఇలాంటి నోటీసులు ఓ లెక్కా అంటూ చెప్పుకొచ్చారు. లీగల్‌గా వచ్చినా, ఇల్లీగల్‌గా వచ్చినా వర్మను ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. 

వర్మ వెనుక వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని బయటపెడతామని చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పాటపై తనకు పిటిషన్‌ వేసే అర్హత లేదనడానికి రాంగోపాల్‌ వర్మ ఎవరని ప్రశ్నించారు. 

సీఎం తరపున పోరాడేందుకు ఎమ్మెల్యేగా తనకు ఆ హక్కు ఉందన్నారు. వర్మను కర్నూలు కోర్డు బోనులో నిలబెడతానని హెచ్చరించారు. వర్మకు వారెంట్ ఇవ్వాలని ఇప్పటికే కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారని, కోర్టు అనుమతి ఇవ్వగానే పోలీసులు చర్య తీసుకుంటారని చెప్పారు.
 
ఆనాడు ఎన్టీఆర్‌ దగ్గర వెళ్లిన త్రిసభ్య కమిటీలో తన తండ్రి కూడా ఉన్నారని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. లక్ష్మీపార్వతిని పక్కన బెట్టేందుకు ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదని గుర్తు చేశారు. ఆ సమయంలో టీడీపీని రక్షించుకునేందుకు చంద్రబాబును, ఎమ్మెల్యేలను బలవంతంగా ఒప్పించారని చెప్పుకొచ్చారు. 

ఆ రోజు వైస్రాయ్‌ హోటల్‌లో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు ఫొటో చూపించి వెన్నుపోటుదారుడు అంటే ఊరుకుంటామా అని హెచ్చరించారు. వర్మ కంటే తనకు లా ఎక్కువ తెలుసునంటూ ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట: ఎమ్మెల్యేకు వర్మ లీగల్ నోటీసు