ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రైతులకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... గురువారం రెండోరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు.

అబద్ధపు హామీలతో ప్రజలను చంద్రబాబు ఇంతకాలం మోసం చేశారని ఆరోపించారు. ఆయన చేసిన మోసాలను చంద్రబాబే స్వయంగా ఒప్పుకుంటే.. రుణమాఫీ పై సీఎం జగన్ స్పందిస్తారని ఆమె అన్నారు. స్పీకర్ ఎంపికపై తమకు సమాచారం లేదంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా రోజా స్పందించారు. 

ప్రతిపక్ష నేతలు చేస్తున్న వాదనను రోజా ఖండించారు. చంద్రబాబు కావాలనే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించడంపై కూడా ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. 

చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత అని, ఆయన ఇంకా సీఎం అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు ఉండే సెక్యూరిటీనే చంద్రబాబుకు ఉంటుందని రోజా చెప్పారు. అప్పటి తన సస్పెన్షన్‌పై ప్రతీకారం ఉండబోదని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.