తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించారు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఒక ఆడబిడ్డగా ఇక్కడే చావాలని డిసైడ్ అయినట్లు ఆమె స్పష్టం చేశారు. జగనన్న పార్టీ పెట్టకుముందు నుంచే ఆయన వెంట వున్నానని ఆమె గుర్తుచేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. పోరాటాలు చేశానని రోజా పేర్కొన్నారు 

చిత్తూరు (chittoor) జిల్లా నగరి (nagari) వైసీపీలో (ysrcp) ఆధిపత్యపోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రోజాకు (mla roja) ఆమె ప్రత్యర్ధి వర్గానికి మధ్య పోసగడం లేదు. తన అసమ్మతి వర్గానికి కీలక పదవులు దక్కడం... అధిష్టానానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై రోజా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా వైసీపీని వీడతారాంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రోజా స్పందించారు. ఒక ఆడబిడ్డగా ఇక్కడే చావాలని డిసైడ్ అయినట్లు ఆమె స్పష్టం చేశారు. 

తాను రాజీనామా చేస్తానని.. పార్టీ మారతానని ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జగనన్న పార్టీ పెట్టకుముందు నుంచే ఆయన వెంట వున్నానని ఆమె గుర్తుచేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. పోరాటాలు చేశానని రోజా పేర్కొన్నారు. తప్పు చేసినవాళ్లే పార్టీ నుంచి వెళ్తారు తప్పించి... జగన్‌ను ప్రేమించే తాము కాదని ఆమె తెలిపారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని.. అందరూ పల్లె నుంచి పట్నంలో ఇల్లు కట్టుకుంటే.. తాను నగరిలో కట్టుకున్నానని రోజా పేర్కొన్నారు. ప్రజల కష్టాన్ని వినాలని.. అవి తీర్చాలని ఆమె సూచించారు. 

నగరిలో ఎమ్మెల్యే రోజాకు చక్రపాణిరెడ్డి (chakrapani reddy) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరూ బాహాటంగానే వాదులాడుకున్నారు. నగరిలో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని చక్రపాణి రెడ్డిపై రోజా ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా చక్రపాణి రెడ్డిని శ్రీశైల ఆలయ బోర్డు చైర్మన్‌గా అవకాశం కల్పించడం రోజా కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. అంతేకాదు.. గతంలో రోజాకు గట్టి ప్రత్యర్థి అయిన నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కెజి కుమార్, ఆయన భార్య శాంతికి ఈడిగ కుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం . ఆ సమయంలోనే రోజా తీవ్ర అసహనానికి గురయ్యారు.