Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయంపై వైసీపీ ధీమా, వ్యూహాత్మకంగా టీడీపీ

ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ  ఎన్నికల  పోలింగ్  ఇవాళ  ఏపీ అసెంబ్లీలో  ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు  పోలింగ్  జరగనుంది.  ఇవాళ  సాయంత్రం  5 గంటల నుండి  ఓట్ల లెక్కింపు  ప్రారంభించనున్నారు. 

MLA Quota  MLC  Elections Begins  in  AP Assembly lns
Author
First Published Mar 23, 2023, 9:34 AM IST

MLA Quota  MLC  Elections Begins  in  AP Assembly lns

ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ  ఎన్నికలు: విజయంపై  వైసీపీ ధీమా,  వ్యూహాత్మకంగా  టీడీపీ

అమరావతి: ఏపీలో ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీ  కోటా  ఎన్నికల పోలింగ్  గురువారంనాడు  ప్రారంభమైంది.  మొత్తం  ఏడు స్థానాలకు   ఎనిమిది మంది  అభ్యర్ధులు  బరిలో  నిలిచారు. బరిలో  నిలిచిన  ఏడు స్థానాలను కైవసం  చేసుకోవాలని  వైసీపీ   పట్టుదలగా  ఉంది.  ఏదైనా అద్భుతాలు  జరిగితే  తాము బరిలో నిలిపిన  అభ్యర్ధి విజయం సాధించే అవకాశం ఉందని  టీడీపీ నేతలు విశ్వాసంతో  ఉన్నారు. తమ అభ్యర్ధులను  గెలిపించుకొనేందుకు  పార్టీలు  ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. 

ఏపీ అసెంబ్లీలో  టీడీపీకి  23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.  అయితే  వీరిలో  నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతును ప్రకటించారు.వల్లభనేని వంశీ, కరణం బలరాం,వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలు  వైసీపీకి మద్దతుగా నిలిచారు.  దీంతో  టీడీపీ బలం  19కి తగ్గిపోయింది.   అసెంబ్లీలో వైసీపీకి  151 మంది  సభ్యులున్నారు.  టీడీపీలో  విజయం సాధించి  వైసీపీ  మద్దతు ప్రకటించిన  నలుగురు  ఎమ్మెల్యేలతో  ఆ పార్టీ బలం  155కి  చేరింది.  మరోవైపు జనసేన  నుండి విజయం సాధించిన  రాపాక వరప్రసాద్  కూడా  వైసీపీకి  మద్దతుగా  ఉన్నారు.  దీంతో  ఈ బలం  156కి చేరింది. టెక్నికల్  అంశాల  ఆధారంగా  బరిలో నిలిపిన  ఏడు అభ్యర్ధుల  విజయం వైసీపీకి నల్లేరు మీద నడకే. అయితే  ఈ  ఎన్నికల్లో టీడీపీ  పంచుమర్తి  అనురాధను బరిలోకి దింపింది.

ఈ ఎన్నికలకు సంబంధించి  తమ పార్టీ ఎమ్మెల్యేలకు  టీడీపీ విప్ ను జారీ  చేసింది.  విప్ ను ధిక్కరించి ఓటు  చేస్తే  చర్యలు తీసుకోవచ్చు. వైసీపీకి  మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలకు  కూడా విప్ పంపినట్టుగా  ఆ పార్టీ  వర్గాలు చెబుతున్నాయి. 

వైసీపీ  రెబెల్  ఎమ్మెల్యేలు  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిలు  తమకు  మద్దతిస్తారని  టీడీపీ ఆశతో  ఉంది.  దీంతో  తమకు  21  ఎమ్మెల్యేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు  ఆశతో  ఉన్నారు. మరో  ఒక్క ఓటు లభిస్తే  పంచుమర్తి అనురాధ విజయం సాధించే  అవకాశం ఉంటుంది. లేదా  వైసీపీ  ఎమ్మెల్యేలు  ఎవరైనా  ఓటును తప్పుగా  వేస్తే  టీడీపీకి  కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. 

బరిలో ఉన్న  ఏడుగురు అభ్యర్ధులను గెలిపించేందుకు గాను  వైసీపీ  నాయకత్వం వ్యూహత్మకంగా  అడుగులు వేస్తుంది.  మంత్రులకు  ఎమ్మెల్యేల బాధ్యతను కేటాయించారు.  ఓటు ఎలా వేయాలనే విషయమై  కూడా  మాక్ పోలింగ్ ద్వారా  చూపారు. 

ఈ ఎన్నికలను  పురస్కరించుకొని  రెండు  పార్టీలు మైండ్ గేమ్  ఆడుతున్నాయి.  మాజీ మంత్రి  గంటా శ్రీనివాసరావు  రాజీనామా ఆమోదించారని  ప్రచారం సాగింది.  మరోవైపు  వైసీపీకి  చెందిన  16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో  ఉన్నారని  టీడీపీ వర్గాలు  ప్రచారం చేస్తున్నాయి. 

తమ పార్టీ ఎమ్మెల్యేలతో  కలిసి  చంద్రబాబునాయుడు  ఓటు హక్కును వినియోగించుకొనేందుకు  రానున్నారు.  ఇప్పటికే  ఏపీ సీఎం వైఎస్ జగన్  అసెంబ్లీకి  చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios