Asianet News TeluguAsianet News Telugu

‘ఆ నలుగురు ఎవరో కూడా మీరే చెప్పండి’

జేసీకి ప్రభాకర్  చౌదరి కౌంటర్

mla prabhakar chowdary

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి  కౌంటర్ వేశారు. మొదటి నుంచి వీరిద్దరికీ ఒకరంటే.. మరొకరికి పడదన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి వీరిమధ్య మాటల యుద్ధం జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల జేసీ  ‘సిట్టింగ్‌లపై ప్రజావ్యతిరేకత ఉంది. జిల్లాలో వారికే టికెట్లు ఇస్తే ముగ్గురు, నలుగురే గెలుస్తారు’ అని పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై  ప్రభాకర్ చౌదరి  మీడియా ముందు స్పందించారు.

గెలిచే ఆ ముగ్గురు, నలుగురు ఎవరో కూడా ఆయనే చెప్పాలన్నారు. ‘అభివృద్ధిని ఎవరూ అడ్డుకోరు.. అయితే ప్రజలకు ఆమోదయోగ్యమైన అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు పనిచేస్తారు. అప్పుడే మనల్ని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకున్నట్లవుతుంది. అన్ని పార్టీలు మారినవారెవరో ఆయన్నే అడగండి. నేను ముందు కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీలోకి వచ్చాను. ఇక్కడ కొన్ని విభేదాల వల్ల అప్పట్లో ప్రజారాజ్యంలో పనిచేశాం. అయితే అక్కడ సభ్యత్వం కూడా తీసుకోలేదు. అయినా టికెట్ల కేటాయింపులో హైకమాండ్‌దే తుది నిర్ణయం. సీఎం కూడా ప్రజామోదం ఎవరికి ఉందో అన్ని రకాలుగా సర్వే చేయించుకుని టికెట్లు కేటాయిస్తారు.
 
అందరికీ లేని అధికారం ఏ ఒక్కరికీ ఉండదు. కొందరు వ్యక్తులు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనిచేయదు. జిల్లాలో తెలుగుదేశం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందనే విశ్వాసం నాకు ఉంది’ అని ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పందిస్తూ.. ‘అది ఎంపీ దివాకర్‌రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం.. పార్టీ అందరి అభిప్రాయాలు అడుగుతుంది. అప్పుడు ఎవరి అభిప్రాయాలు వారు చెబుతారు. అయితే చివరికి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios