‘సాక్షి’ మీడియాపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడుతున్నారు. సాక్షి పత్రిక, టీవీ, వెబ్ సైట్లపై పరువు నష్టం కేసు వేస్తానని ఆమె హెచ్చరించారు. తమ కుటుంబ వ్యవహారాన్ని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన పై దుష్ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. తన వదిన విజయలక్ష్మి, తనకు మధ్య జరిగిన వ్యవహారంలో అసలు విషయాలను మరుగునపెట్టి, ఆమెపై తాను దాడి చేశానని పేర్కొంటూ సోషల్‌ మీడియా వీడియో క్లిప్పింగ్‌ పోస్ట్‌ చేసిన ముగ్గురు వ్యక్తులు నానిబాబుపాత్రుడు, కఠారి చందు, మురళీలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానిక ఏఎస్‌పీ అమిత్‌బర్ధార్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 
 
తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఆ ముగ్గురిపైనా చట్టపరంగా చర్యలు చేపట్టాలని ఈశ్వరి డిమాండ్‌ చేశారు. అలాగే తాను భూ కబ్జాలకు పాల్పడ్డానని తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువునష్టం కేసు వేస్తానని ఎమ్మెల్యే ఈశ్వరి స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా సాక్షి పత్రిక, ఛానల్‌ తనపై దుష్ప్రచారం చేయడం తగదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి మీడియా తప్పుడు రాతలు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు.