సినీ నటుడు చిరంజీవికి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చురకలు వేశారు. రాజకీయాల్లోకి మళ్లీ వస్తాడని అనుకోవడం లేదని అన్నారు.
కాకినాడ : వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సినీ నటుడు, మాజీ రాజకీయ నాయకుడు చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ‘‘చిరంజీవి తాను రాజకీయాలకు సరిపోను అనుకునే మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అలా వరుసగా సినిమాలు చేస్తూ ప్రజల్ని అలరిస్తున్నారు. ఇది మంచి పరిణామం. చిరంజీవికి సినిమాల్లోనే సౌకర్యంగా ఉంది’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చిరంజీవికి చురకలేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చిరంజీవి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. ‘పొలిటిషన్ అయినా సినిమా స్టార్స్ అయినా వారి మనుగడ సాగాలంటే ప్రజలు ఆదరించాలని’ అన్నారు. సినీ పరిశ్రమలోని కార్మికుల,పేదల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి స్పష్టంగా తెలిపారు.
సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే: చిరుకు విజయసాయిరెడ్డి కౌంటర్!
ఇదిలా ఉండగా, వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. బ్రో చిత్రంపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
‘‘ఎంతసేపు చిత్ర పరిశ్రమ గురించి కాదని.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటివాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?’’ అని వైసీపీ ప్రభుత్వానికి చిరంజీవి సుత్తిమెత్తగా చురకలు అంటించారు.
దీంతో చిరంజీవి తన తమ్ముడు, జనసే అధినేత పవన్‌కు సపోర్టుగా నిలిచినట్టు అయింది. ఈ వ్యాఖ్యతో ఇంతకాలం చిరంజీవిపై సాఫ్ట్ కార్నర్ చూపించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయనపై మూకుమ్మడి దాడికి దిగుతున్నారు. మరోవైపు జనసేన నేతలు కూడా చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు.
