మెగాసార్ట్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చిరంజీవిపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. చిరంజీవి పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు.

మెగాసార్ట్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చిరంజీవిపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. చిరంజీవి పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదని.. ప్రజలు ఆదరిస్తేనే హీరోకైనా, రాజకీయ నేతకైనా మనుగడ అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని.. వాళ్ళూ మనుషులేని అన్నారు. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని తెలిపారు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. 

‘‘కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్’’ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. బ్రో చిత్రంపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఎంతసేపు చిత్ర పరిశ్రమ గురించి కాదని.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?’’ అని వైసీపీ ప్రభుత్వానికి చిరంజీవి సుత్తిమెత్తగా చురకలు అంటించారు. దీంతో చిరంజీవి.. పవన్‌కు సపోర్టుగా నిలిచినట్టు అయింది. 

దీంతో ఇంతకాలం చిరంజీవి సాఫ్ట్ కార్నర్ చూపించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు కూడా చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు.