చంద్రబాబు అరెస్ట్ వీడియోలను చూసి జగన్ ఆనందం.. లండన్‌లో ఇదే పని : ఆనం రాంనారాయణ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు వైసీపీ బహిష్కృత నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి . చంద్రబాబు అరెస్ట్ వీడియోలను లండన్‌లో కూర్చొని చూస్తూ జగన్ ఆనందించాడని రాంనారాయణ రెడ్డి మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు వైసీపీ బహిష్కృత నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. జగన్ సైకోలా వ్యవహరిస్తున్నాడని.. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తూ ఆనందించాడని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ దృశ్యాలను ఎప్పటికప్పడు తనకు పంపించే బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించాడని ఆనం వ్యాఖ్యానించారు.
ఆ వీడియోలను లండన్‌లో కూర్చొని చూస్తూ జగన్ ఆనందించాడని రాంనారాయణ రెడ్డి మండిపడ్డారు. గతంలో రఘురామ కృష్ణంరాజు విషయంలోనూ ఇదే జరిగిందని ఆయన గుర్తుచేశారు. జగన్ తమను పట్టించుకోకపోయినా సజ్జల, విజయసాయిరెడ్డిలు మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆనం దుయ్యబట్టారు. చంద్రబాబు లాయర్లు .. సజ్జల, విజయసాయిరెడ్డిల కాల్ డేటా అడిగే అవకాశం వుందన్నారు.
ALso Read: ములాఖత్‌లో చంద్రబాబుతో మాట్లాడింది ఇదే.. : పవన్ కల్యాణ్, వైసీపీపై సెటైర్లు
మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలని న్యాయ నిపుణులు చెబుతున్నారని రాం నారాయణ రెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలిసి గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారని ఆయన పేర్కొన్నారు. ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆనం చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ పొందిన 87 వేల మంది పిల్లలు మంచి ఉద్యోగాల్లో వున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతోన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను మూసేసేందుకు కుట్ర జరుగుతోందని ఆనం ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వున్నా.. ఏపీ అభివృద్ధి కోసం తన వ్యక్తిగత అభివృద్ధిని చంద్రబాబు వదులుకున్నారని రాం నారాయణ రెడ్డి ప్రశంసించారు.