ములాఖత్‌లో చంద్రబాబుతో మాట్లాడింది ఇదే.. : పవన్ కల్యాణ్, వైసీపీపై సెటైర్లు
రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ములాఖత్ అయ్యారు.

రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఏం మాట్లాడారని మీడియా ప్రశ్నించగా.. ‘‘ములాఖత్‌లో చంద్రబాబను.. వారి ఆరోగ్యం ఎలా ఉంది?, మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉంది. నేను మీతోని విబేధించాను.. పాలసీపరంగా గొడవపడ్డాను.. వ్యక్తిగతంగా మీ మీద ఇలాంటి అభిప్రాయం అయితే లేదు. దీనిని చాలా సంపూర్ణంగా తెలియజేశారు.
చంద్రబాబు వయసు పెద్దదని, ఆరోగ్యం సరిగ్గా ఉందని అధికారులను అడిగాను.. వారు చెప్పాల్సింది చెప్పారు. ఆయనకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పాను. ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నానని ఆయన చెప్పాను. మొన్నటి వరకు ఆలోచించానని.. మీలాంటి వ్యక్తికి ఈ పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అధోగతికి వచ్చిందని.. ఇక నిర్ణయం తీసకుంటున్నానని చెప్పి దానిని వెల్లడించడం జరిగింది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి వస్తుంటే.. అక్కడ ఇంత సంపూర్ణమైన విజన్ చూసిన వ్యక్తికి ఈ దుస్థితి ఏమిటని బాధ అనిపించిందని చెప్పారు. రేపటి నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణపై దృష్టి సారిస్తామని పవన్ చెప్పారు. ఇరు పార్టీలు ఉమ్మడిగా వెళ్లడంపై పార్టీల వర్గాలను సమాయత్తం చేయనున్నట్టుగా తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించడమే తమ ముందున్న బాధ్యత అని చెప్పారు. జగన్ ఎందుకు ప్రెస్ మీట్‌లు ఎందుకు పెట్టడని ప్రశ్నించారు. జగన్ ప్రెస్ మీట్ పెడితే.. తాను కూడా ఒక ప్రశ్న అడుగుతానని చెప్పారు. తన పార్టీ ఎలా నడపాలనేది వైసీపీ వాళ్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. తాను ఏమైనా జగన్ అక్కడి నుంచి పోటీ చేయాలి, ఇక్కడి నుంచి పోటీ చేయాలి అని తాను చెబుతున్నానా అని ప్రశ్నించారు.
Also Read: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి.. పవన్ ప్రకటన
అరెస్ట్‌లు, చనిపోవడం బాధ కలిగించే అంశాలు అని అన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు తాను బాధపడ్డానని చెప్పారు. జగన్ జైలులో ఉంటే తాను ఆనందపడలేదని తెలిపారు. అలా అనుకుంటే దిగజారుడుతనమేనని చెప్పారు. చంద్రబాబు భద్రత విషయాన్ని కేంద్ర హోం అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఏపీ అతలాకుతలం అయిపోతే.. దక్షిణాది మొత్తం అతలాకుతలం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దుస్థితిని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వాళ్లు సింహాలు అయితే సింగిల్‌గానే రానివ్వండి అని వైసీపీపై సెటైర్లు వేశారు.