Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు పురంధేశ్వరి వత్తాసు: రఘురామ అరెస్టుపై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణమ రాజు అరెస్టుతో చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు.

MLA Amabati Rambabu retaliates Chandrababu comments on Raghurama Krishnama raju incident
Author
Amaravathi, First Published May 15, 2021, 10:05 PM IST

అమరావతి: పార్లమెంటు సభ్యుడు రఘురామరాజు ఏ రకంగా రాజద్రోహానికి పాల్పడ్డారో వివరిస్తూ.. సీఐడీ ఏకంగా 46కి పైగా వీడియోలను కోర్టు ముందు సమర్పించిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.. ఇటువంటి వ్యక్తి భారత రాజకీయ వ్యవస్థలో ఒక చీడపురుగు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యక్తిని సమర్థిస్తున్న చంద్రబాబు నాయుడ్ని ఏమనాలో ప్రజలకే వదిలివేస్తున్నామని ఆయన అన్నారు. 

ప్రతిరోజూ రెండు గంటల పాటు రచ్చబండ పేరుమీద నోటికి వచ్చిన బూతులు తిట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో ఒక డ్రామా నడపటం చంద్రబాబు నాయుడుకు, లోకేశ్‌కు వారి అనుచరులైన టీవీ5, ఏబీఎన్‌ ఛానళ్లకు అలవాటుగా మారిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శను ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరని అన్నారు. విమర్శను ఎవరైనా ఆహ్వానిస్తారని ఆయన అన్నారు 

అయితే అధికార పార్టీ తరుపున ఎన్నికై పిచ్చి వాగుడు వాగుతుంటే.. ఎంతో సంతోషపడి ఆయన వెనకనుండి ఈ కథను నడిపించిన చంద్రబాబుకు ఇప్పుడు రఘరామ అరెస్ట్‌తో గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైందని అంబటి వ్యాఖ్యానించారు. బహుశా.. తనకు కూడా ఇదే గతి పడుతుందన్న భయం ఒకపక్క, రఘురామరాజుతో ఇన్నాళ్లు నడిపిన అపవిత్ర బంధం బయటపడుతుందన్న భయం మరోపక్క చంద్రబాబును వెంటాడుతోందని అన్నారు. 

రఘురామరాజుతో నిజాలు చెప్పిస్తే తమ ఇంటి గుట్టు, తాము చేసిన కుట్రలు బయటపడతాయన్న భయంతోనే నిన్న టీడీపీ, దాని అనుబంధ ఛానళ్లు మరుక్షణం రఘురామరాజుకు వత్తాసు పలికాయని ఆయన అన్నారు. ఈరోజు కూడా రఘురామరాజు ప్రవర్తనలో బెయిల్ ఫిటిషన్‌ డిస్మిస్ చేసిన వెంటనే ఎంతటి మార్పు వచ్చేసిందో, ఎంతటి డ్రామా ఆడారో అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వివరించారని ఆయన గుర్తు చేశారు. 

రఘురామరాజు మహా నటుడు. తనకు తాను గాయాలు చేసుకొని మరీ.. బయటపడాలని ప్రయత్నించగల సమర్థుడని అన్నారు. బహుశా.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ముందుగా ఊహించే ఈ విషయంలో కూడా స్కెచ్ వేసి ఉంటారని భావించాలని ఆయన అన్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లు ... రఘురామరాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన ఆయనలో భయాన్ని, తాను కూడా దొరికిపోబోతున్నా అన్న భావాన్ని చూపిస్తోందని అన్నారు. 

పురందేశ్వరి వంటి బీజేపీ నేతలు కూడా బాబు వాదనకు మద్దతు పలకటం సిగ్గుచేటని అన్నారు. రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు.. రాజద్రోహం అవునో, కాదో చెప్పాల్సింది న్యాయస్థానాలే తప్ప చంద్రబాబు కాదని అన్నారు. రఘురామరాజును ఎవ్వరూ రాజకీయ కక్ష సాధింపు చేయలేదని ఆయన అన్నారు. రఘురామరాజే ఏడాదికి పైగా రాజకీయ కక్ష సాధింపునకు, ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నానికి, రాజద్రోహానికి టీడీపీతో జత కట్టి మరీ పాల్పడ్డాడు అన్నది స్పష్టంగా కనిపిస్తోందని అంబటి రాంబాబు అన్నారు. 

కేసు దర్యాప్తు జరగాలి. చంద్రబాబు పాత్ర కూడా తేలాలని ఆయన అన్నారు. దీన్ని అడ్డుకునే ప్రతి ప్రయత్నం చంద్రబాబు భయంతో చేస్తున్న ప్రయత్నమే తప్ప ప్రజాస్వామ్యం మీద భక్తితో చేస్తున్న ప్రయత్నం కాదని అన్నారు. ఎన్నికల్లో గెలవలేని చంద్రబాబు ఏదో రకమైన మేనేజ్‌మెంట్‌ మీదే వంద శాతం నమ్మకాలు పెట్టుకొని రఘురామరాజుతో అంటకాగుతున్నాడని ఇంతకాలం అందరూ అనుమానించింది స్పష్టమైందని అన్నారు. తోడు దొంగలు ఇద్దరి ముసుగు తొలిగిందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios