సీఎం కీలక నిర్ణయం.. ఇక మంగళగిరి మంగళకరమే: ఆళ్ల రామకృష్ణారెడ్డి
త్వరలోనే మంగళగిరి కార్పొరేషన్ గా రూపాంతరం చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
తాడేపల్లి: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మార్చాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో మంగళగిరి ప్రాంతం మంగళకరం కానుందని స్థానిక ఎమ్మెల్యే పేర్కొన్నారు.
''మంగళగిరి కార్పొరేషన్ గా రూపాంతరం చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి ఏలాంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించలేదు'' అన్నారు.
''రాజధాని 29 గ్రామాల నుంచి మంగళగిరి మండలం వేరు చేస్తున్నారనే ప్రచారం పూర్తి అవాస్తవం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. కేవలం మంగళగిరి నియోజకవర్గ గ్రామాలు మాత్రమే మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం జరిగింది'' అన్నారు.
''దాదాపు రూ.1500 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న కాలంలో జగన్ సర్కార్ తాడేపల్లి, మంగళగిరిలో రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నాం. ఈ పనులతో ఈ ప్రాంత మరింత అభివృద్ధి చెందుతుంది'' అన్నారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి.