మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని రమేష్ ఎన్నో అక్రమాలు చేశారని... వాటిని ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. కనీస నిబంధనలను కూడా పాటించకుండా అక్రమంగా లేఔటు వేసి వెంచర్లను వేశారని మండిపడ్డారు. సుమారు 40 ఎకరాల్లో లేఔట్లను వేసి, విలాసవంతమైన విల్లాలు కట్టారని అన్నారు.

 ఆ విల్లాలను ఒక్కోదాన్ని 5 కోట్లకు అమ్ముకున్నారని, కాజా గ్రామానికి కట్టాల్సి ఉన్న బిల్డింగ్ పర్మిట్, లే అవుట్ ఫీజులను కూడా ఇప్పటి వరకు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.గజం విలువ నాలుగు వేలుగా రిజిస్ట్రేషన్ విలువ చూపించి సుమారు 40 నుంచి 50 కోట్ల వరకు పంచాయితీకి రావాల్సిన ఫీజును ఆయన ఎగ్గొట్టారని, ఎగ్గొట్టడమే కాకుండా పంచాయితీ మీదే కేస్ వేశారని విమర్శించారు. 

అయితే ఆ కేసులు బెంచ్‌ మీదికి రాకుండా లింగమనేని మేనేజ్ చేశారని, ఈ అంశంపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించాలని తాను ముఖ్యమంత్రి జగన్‌ని కోరతానని ఆళ్ళ తెలిపారు. ఒక్క నా నియోజకవర్గంలోనే 40 నుంచి 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని, చంద్రబాబుకు కరకట్ట ఇల్లు ఇచ్చారు కాబట్టే ఈయన ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారని ఆరోపించారు.