వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినా... త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా... కొంచెం కూడా ఆళ్లలో గర్వం లేదని.. ఇప్పటికీ సాధారణ పౌరుడిలా జీవనం సాగిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆళ్ల ఇటీవల బేగంపేట నుంచి గుంటూరుకి పల్నాడ్ ఎక్స్ ప్రెస్ లో సాధారణ బోగిలో ప్రయాణించారు. ట్రైయిన్ లో ఆయనను గుర్తుపట్టిన ప్రయాణికులు ఆయనతో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. ఎమ్మెల్యే అయ్యి ఉండి సాధారణ పౌరుడిలా తమతో ప్రయాణించడం చూసి వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా... ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఆ రైల్లో దాదాపు 50మంది జగన్ ముఖ్యమంత్రి అయినందుకు మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెళ్తున్నవారు కావడం విశేషం. ఈ విషయాన్ని వారు ఆళ్లతో పంచుకున్నారట. జగన్ సీఎం కావాలని ప్రజలంతా కోరుకున్నారని... అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని ఈ సందర్భంగా ఆళ్ల అన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పై పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే.. మరో మూడు రోజులు  ఆగాల్సిందే.