విశాఖపట్నం: ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించినా కామాంధుల ఆగడాలు కొనసాగుతూనే వున్నాయి. మహిళలకు, చిన్నారులు ఎక్కడో ఒకచోట మృగాళ్ల చేతిలో చిక్కి మానాన్నే కాదు కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇద్దరు మృగాల చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురయిన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విశాఖ జిల్లా పెందూర్ కు చెందిన ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కార్తిక్(24) లోబర్చుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన సత్యనారాయణ(63) అనే వృద్దుడు బ్లాక్ మెయిల్ చేసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా వీరిద్దరు పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. 

ఇటీవల బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్భం దాల్చినట్లు తేల్చారు. దీంతో బాలికను నిలదీయగా ఇంతకాలం తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయటపెట్టింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.