అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టీంలోకి మరో ఐఏఎస్ అధికారి వచ్చి చేరారు. గతంలో ఏపీలో కీలక పోస్టులు నిర్వహించి కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారిని ఏపీకి కేటాయించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్ ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. 

సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ఎ.వీ ధర్మారెడ్డిని డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మారెడ్డి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌గా సమర్ధవంతంగా పనిచేసి గుర్తింపు పొందారు. 

అనంతరం ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. గతంలో టీటీడీకి ధర్మారెడ్డి చేసిన సేవలకు మెచ్చి మరొకసారి ధర్మారెడ్డికి తిరుమలలో పని చేసే అవకాశం ఇవ్వాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో కీలకమైన హోంశాఖ జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు ధర్మారెడ్డి. అయితే రాష్ట్రప్రభుత్వం కోరికమేరకు డిప్యూటేషన్ పై ఆయన ఏపీకీ వస్తున్నారు. అయితే గతంలో పనిచేసినట్లు ఆయన టీటీడీ జేఈవోగా నియమిస్తారా లేక కీలక శాఖకు నియమిస్తారా అన్నది వేచి చూడాలి.