‘జగన్ అన్న’   కాదు   ‘జగన్ తాత’

First Published 20, Dec 2017, 7:11 AM IST
Ministers says jagan also eligible for old age pension
Highlights
  • వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రపై మంత్రుల్లో కలవరం స్పష్టంగా కనపిస్తోంది.

వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రపై మంత్రుల్లో కలవరం స్పష్టంగా కనపిస్తోంది. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇస్తున్న హామీలపై మంత్రులు స్పందిస్తున్న తీరు చూస్తుంటేనే వారిలో ఆందోళన ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. కాకపోతే తమలో ఆందోళన బయటపడకుండా మ్యానేజ్ చేస్తున్నారంతే. ఇంతకీ విషయం ఏంటంటే, పాదయాత్ర సందర్భంగా జగన్ ఇస్తున్న హామీల్లో కీలకమైనది వృద్ధాప్య ఫించన్ వయోపరిమితిని 45 ఏళ్ళకు తగ్గిస్తాను అన్నది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల్లో కాయ కష్టం చేసుకునే వారికి ఫించన్ వయస్సును 45 ఏళ్ళకే తగ్గిస్తానని చెప్పారు.

సరే, జగన్ హామీని ఎంతమంది నమ్ముతున్నారన్న విషయాన్ని పక్కన పెడితే జనాల్లో విస్తృతంగా చర్చ అయితే జరుగుతోంది. ఇక్కడే మంత్రుల్లో కలవరం మొదలైంది. ఎందుకంటే, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటే, వైఎస్ హయాంలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. పాదయాత్ర సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ, రైతులకు ‘ఉచిత విద్యుత్’ హామీనిచ్చారు. ఆ హామీపై అప్పట్లో సిఎంగా ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ ఉచితంగా విద్యుత్ సరఫరా అంటే విద్యుత్ తీగలపై బట్టలారేసుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు.

ఇపుడు కూడా అదే విషయం రిపీటవుతోంది. జగన్ హామీపై చంద్రబాబు మాట్లాడకపోయినా మంత్రులు మాత్రం విపరీతంగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, జగన్ ఇస్తున్న హామీ ప్రకారం జగన్ కూడా వృద్ధుడే అంటూ ఎద్దేవా చేశారు. మామూలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమైతే 65 ఏళ్ళ వాళ్ళనే వృద్ధులంటారని నారాయణరెడ్డి చెప్పారు.

కానీ, 45 ఏళ్ళకే ఫించన్ అన్న జగన్ హామీని పరిగణలోకి తీసుకుంటే జగన్ కూడా వృద్దుడే అన్నారు. ఎలాగంటే, జగన్ కూడా డిసెంబర్ 21న (గురువారం) 45వ సంవత్పరంలోకి అడుగుపెడతారట. ఎలాగుంది మంత్రుల లాజిక్? 45-60 ఏళ్లమధ్య వారిని ప్రౌఢ అంటారని కానీ జగన్ వాళ్ళని వృద్ధులను చేసేసినట్లు మండిపడ్డారు. కాబట్టి జగన్ తనను తాను ‘జగన్ అన్న’ అని కాకుండా ‘జగన్ తాత’ అని పిలిపించుకోవాలని కూడా ఎద్దేవా చేశారు.

 

loader