సొంత పార్టీ ఎంపీటీసీని మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు కాళ్లు విరిచేస్తానంటూ ఆయన అడపా సత్తిబాబు అనే ఎంపీటీసీకి వార్నింగ్ ఇచ్చారు. 

కోనసీమ జిల్లాకు (konaseema district) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ గత వారం అమలాపురంలో (amalapuram) నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనలో మంత్రి విశ్వరూప్ (minister viswarup) ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన‌వారిలో వైసీపీ ఎంపీటీసీ అడ‌పా స‌త్తిబాబు ఉన్నారు. 

అల్ల‌ర్ల‌లో స‌త్తిబాబు (sattibabu) ఉన్నార‌న్న విష‌యం తెలుసుకున్న మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి (krishna reddy) అతనికి ఫోన్ చేసి అంతు చూస్తానంటూ బెదిరించినట్లుగా ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి. సదరు ఆడియోలో ఎంపీటీసీ సత్తిబాబును బెదిరిస్తూ కృష్ణారెడ్డి అస‌భ్య ప‌ద‌జాలాన్ని కూడా వాడారు. రెండు కాళ్లు విరిచేస్తాన‌ని, అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫోన్ సంభాష‌ణ‌కు సంబంధించిన ఆడియో బ‌య‌ట‌కు రాగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మరో ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysrcp) ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (jakkampudi raja) తనపై దాడి చేశారని ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సూర్య కిరణ్ (surya kiran) ఆరోపించారు. సూర్య కిరణ్.. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్‌ ఏఈఈగా పనిచేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనను మూడు సార్లు చెంపదెబ్బ కొట్టారని రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సూర్య కిరణ్ మాట్లాడారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబంధించిన పుష్కర కాలువ రంగంపేట పరిధిలో ఉంది.

ALso Read:ఇంజనీర్‌పై దాడి.. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అరెస్ట్‌కు నారా లోకేష్ డిమాండ్

2020లో పోలవరం ఎడమ కాలువ పరిధిలో రైతులు పుష్కర కాలువ పూడికతీత పనులు నిర్వహించారు. వీటికి నిధులు మంజూరయ్యాక బిల్లులు చెల్లించాలని రైతులు అప్పట్లోనే అధికారులకు చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ బిల్లులు రాకపోవడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ఏడాదిగా ఎమ్మెల్యే అధికారులను అడుగుతున్నారు.

ఈ క్రమంలోనే బుధవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఈ విషయం గురించి ఎమ్మెల్యే.. కార్యనిర్వాహక ఇంజినీరు సూర్యకిరణ్‌ను ప్రశ్నించారు. వివరణ ఇస్తుండగానే.. ఆయన ఆగ్రహంతో తనను మూడుసార్లు చెంపపై కొట్టారని సూర్య కిరణ్ తెలిపారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా.. వారు కనీసం ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.