ప్రభుత్వ ఇంజనీర్‌పై ఉన్నతాధికారుల సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ ఇంజినీర్ పై వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (jakkampudi raja) చేయిచేసుకోవడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసీపీ పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారని... ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ అసెంబ్లీ రౌడీలు పడ్డారని లోకేశ్ వ్యాఖ్యానించారు. తన అనుచరుల బిల్లులు చేయలేదని పోలవరం ఏఈ సూర్యకిరణ్ ను వైసీపీ రౌడీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్టడం దారుణమన్నారు. 

మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజినీరుపై దాడి జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం విచారకరమని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడే ఉద్యోగ సంఘాల నాయకులు ఈ దాడిని ఖండించకపోవడం అన్యాయమన్నారు. సూర్యకిరణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేష్ వెల్లడించారు. ఇంజినీర్ పై దాడికి పాల్పడిన జక్కంపూడి రాజాను తక్షణమే అరెస్ట్ చేయాలని ...బాధితుడు సూర్యకిరణ్ కు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Also Read:వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేశారు: ఇరిగేషన్‌ ఏఈఈ ఫిర్యాదు..!

కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై దాడి చేశారని ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సూర్య కిరణ్ ఆరోపించారు. సూర్య కిరణ్.. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్‌ ఏఈఈగా పనిచేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనను మూడు సార్లు చెంపదెబ్బ కొట్టారని రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సూర్య కిరణ్ మాట్లాడారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబంధించిన పుష్కర కాలువ రంగంపేట పరిధిలో ఉంది.

2020లో పోలవరం ఎడమ కాలువ పరిధిలో రైతులు పుష్కర కాలువ పూడికతీత పనులు నిర్వహించారు. వీటికి నిధులు మంజూరయ్యాక బిల్లులు చెల్లించాలని రైతులు అప్పట్లోనే అధికారులకు చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ బిల్లులు రాకపోవడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ఏడాదిగా ఎమ్మెల్యే అధికారులను అడుగుతున్నారు.

ఈ క్రమంలోనే బుధవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఈ విషయం గురించి ఎమ్మెల్యే.. కార్యనిర్వాహక ఇంజినీరు సూర్యకిరణ్‌ను ప్రశ్నించారు. వివరణ ఇస్తుండగానే.. ఆయన ఆగ్రహంతో తనను మూడుసార్లు చెంపపై కొట్టారని సూర్య కిరణ్ తెలిపారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా.. వారు కనీసం ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…