Asianet News TeluguAsianet News Telugu

తొందర్లోనే లోకేష్ ను చంద్రబాబు పరామర్శించే రోజులు: వెల్లంపల్లి సంచలనం

నారా లోకేశ్‌ చౌదరి ప్రజల గురించి ఏనాడు ఆలోచన చేయలేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 

minister vellampally srinivas sensational comments on nara lokesh
Author
Amaravathi, First Published Jun 26, 2020, 9:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: నారా లోకేశ్‌ చౌదరి ప్రజల గురించి ఏనాడు ఆలోచన చేయలేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో లోకేశ్ చౌదరి ప్రభుత్వంపైన విమర్శలు చేయటాన్ని వెల్లంపల్లి ఖండించారు. అన్ని వర్గాలు మెచ్చుకునేలా ప్రభుత్వ పనితీరును ఉందని ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయటం ఏంటని మంత్రి మండిపడ్డారు. 

కరోనా సమయంలోనూ విశాఖపట్నంలో ఒక దురదృష్ట సంఘటన జరిగితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఆలోచనతో దాన్ని తప్పించటానికి కృషి చేశారన్నారు. ఆ విపత్తు సమయంలో ప్రజలకు అండగా సీఎం నిలిచారని గుర్తు చేశారు. అప్పుడు ఒక్కసారైనా నారా చంద్రబాబు, నారా లోకేశ్ చౌదరి ప్రజల్ని కలిసి వారికి ధైర్యం, భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఇద్దరు గజదొంగలు ప్రభుత్వానికి దొరికితే లోకేశ్ పరామర్శలు చేయటం ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్‌లు ఎగగొట్టటం, ఒక్క పర్మిట్‌తో 100 బస్సులు తిప్పటం, లారీలను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని మంత్రి మండిపడ్డారు. అడ్డదారిలో ట్యాక్స్‌లు కట్టకుండా బస్సులు తిప్పుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అయితే, ప్రజలకు ఏదో అన్యాయం జరిగిందన్నట్లు హడావుడిగా నారా లోకేశ్ అక్కడ వెళ్తే ఏం జరిగిందో చూశామన్నారు. ఆయన సైజుకు తగ్గట్లు చక్కటి విందు భోజనం చేసి వచ్చారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. 

అలాగే ఈరోజు పేద ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న ఒక దొంగ కుటుంబాన్ని పరామర్శకు లోకేశ్‌ వెళ్లారని వెల్లంపల్లి అన్నారు. వెళ్లిన వ్యక్తి ఆ కుటుంబానికి ధైర్యం చెబితే ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదన్నారు. ధైర్యం చెప్పారనుకుంటే మీడియా సమావేశంలో నానా కారుకూతలు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గందరగోళం జరుగుతోందని మీడియా సమావేశంలో అన్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. అసలు లోకేశ్ అక్కడకు ఎందుకు పరిగెత్తుకు వెళ్లారంటే అచ్చెన్నాయుడు కానీ, వారి కుటుంబసభ్యులు తన(లోకేశ్‌) పేరు ఎక్కడ చెబుతారో అన్న భయంతో పరిగెత్తుకొని వెళ్లి బ్రతిమిలాడుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 

అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుల్ని కలిసిన తర్వాత మీడియాతో నారా లోకేశ్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని వెల్లంపల్లి మండిపడ్డారు. సహజంగా పార్టీలో నాయకుడ్ని మాత్రమే బాహుబలి అంటారు.  చంద్రబాబు తర్వాత నారా లోకేశ్‌కు ఏమీ లేదని టీడీపీలో బాహుబలి అంటే అచ్చెన్నాయుడు అని ఆయనే స్వయంగా పోల్చుకున్నారని వెల్లంపల్లి అన్నారు. హైట్‌గా ఉన్నారని అచ్చెన్నాయుడు, అడ్డంగా ఉన్నారని లోకేశ్ చౌదరి ఎవ్వరూ బాహుబలి కాలేరని వెల్లంపల్లి అన్నారు. ఏపీకి ఏకైక బాహుబలి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. మీరు అంతా కాలికేయులు లాంటి వారన్న సంగతి గమనించాలని వెల్లంపల్లి తెలిపారు. 

read more    ప్రభుత్వోద్యుగులకు శుభవార్త... వారానికి ఐదురోజులే పని, పొడిగించిన జగన్ సర్కార్

రాజనీతిలో కానీ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లటంలో కానీ, బాహుబలంలాంటి బలం ఉన్న వ్యక్తి జగన్ మాత్రమే అని వెల్లంపల్లి అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే దాంట్లో లోకేశ్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు.

 ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడుకు ఏమీ తెలియదని, ఈఎస్‌ఐ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని ప్రజలకు తప్పుడు సమాచారం పంపించేలా లోకేశ్ మాట్లాడటంపై వెల్లంపల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా ఇలాంటి లేఖలు రోజుకు 100 ఇచ్చానని అంటే అప్పుడే నారా లోకేశ్‌లో భయం మొదలైందని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. రేపు లోకేశ్ రాసిన లేఖలు ఎక్కడ బయటకు వస్తాయో ప్రభుత్వం ఆ లేఖల మీద ఎక్కడ చర్యలు తీసుకుంటుందో అని ఆయన భయపడుతున్నారు. 

ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి మంత్రి సంతకం విలువ తెలియదా? ఇచ్చేయమని మంత్రి ఆర్డర్ జారీ చేశాక కింద అధికారులు ఇవ్వకుండా ఊరుకుంటారా? మంత్రికి ఉన్న విలువలు మీకు తెలియవా? ఏదో లెటర్ ఇచ్చాను. వంద లెటర్స్ ఇచ్చానని లోకేశ్ అన్నారు. తప్పకుండా ఆ లేఖలు అన్నీ కూడా పరిశీలిస్తాం. ఇటువంటి స్కాంలు నువ్వు చేసి ఉన్నా.. చంద్రబాబు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదని వెల్లంపల్లి హెచ్చరించారు. 

దుర్గగుడి ప్లైఓవర్‌ కట్టలేక సంవత్సరాలు తరబడి గడిపితే ఆగస్టు 15న నితిన్‌ గడ్కరీతో దాన్ని ప్రారంభించటానికి సిద్దం చేసిన ప్రభుత్వం మాదని వెల్లంపల్లి పేర్కొన్నారు. అటువంటి మా ప్రభుత్వంలో అభివృద్ధి లేదనటం సరికాదని వెల్లంపల్లి మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని అనటంపై వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్, పూలే, మహాత్మాగాంధీ ఆశయాలు నెరవేరస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అజ్ఞాని లోకేశ్ చౌదరి తెల్సుకోవాలని అన్నారు.ముందు దివంగత రాజారెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేశ్‌కు లేదన్నారు. 

ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాలన్నా, పెళ్లానికి మెసేజ్‌ పెట్టాలన్నా సీఎం శ్రీ జగన్ గారికి చెప్పాలని లోకేశ్ అన్నారని అయ్యా.. లోకేశ్ గారు మీ భార్య బ్రహ్మణికి మెసేజ్‌ పెట్టేటప్పుడు శ్రీ జగన్ గారి చెప్పే పెడుతున్నారా? ఇప్పటి వరకు మీరు అలాగే పెడుతున్నారా అని లోకేశ్‌ను వెల్లంపల్లి ప్రశ్నించారు. మీరు మాత్రం మీ భార్యకు నేరుగా మెసేజ్‌లు పెట్టుకోవచ్చు. మిగతావాళ్లు పెట్టాలంటే  జగన్‌  పర్మిషన్ కావాలంటారా అని వెల్లంపల్లి మండిపడ్డారు. అసలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని గతంలో హైదరాబాద్‌లో అరెస్ట్ వారిని ఎన్నెన్ని జిల్లాలు తిప్పారో అని వెల్లంపల్లి గతాన్ని గుర్తు  చేశారు. మీరు చేస్తే చట్టం.. వేరే వారు చేస్తే తప్పుడు పనులా అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నారా లోకేశ్ అపరిచితుడు కూడా కాదు... గజనీ అని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లు చేసిందంతా లోకేశ్ మరిచిపోయి.. వడ్డీతో సహా తీర్చుకుంటామనటం ఏంటని వెల్లంపల్లి అన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలు వడ్డీ మాత్రమే తీర్చుకున్నారు. అసలు రాబోయే రోజుల్లో మేం గ్యారంటీగా తీరుస్తామని వెల్లంపల్లి హెచ్చరించారు. 

 గజదొంగల దగ్గరకు వెళ్లి ప్రెస్‌మీట్లు పెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ 13 నెలల్లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూడండని.. చంద్రబాబు, ఎన్టీఆర్‌ కూడా చేయలేని పనులు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని పనులు చేస్తుంటే లోకేశ్‌కు రాజకీయాలు కావాలా అని వెల్లంపల్లి మండిపడ్డారు. భావి ముఖ్యమంత్రి అని చెప్పుకునే నారా లోకేశ్ మంగళగిరి ఓడిపోయి ఈరోజు ఈవిధంగా మాట్లాడటం ఏంటని వెల్లంపల్లి మండిపడ్డారు. టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా మీతో లేరని వెల్లంపల్లి అన్నారు. ఎందుకు అంటే గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉందో వారు చూశారన్నారు. 

లోకేశ్‌కు బుద్ధీ, జ్ఞానం ఉంటే.. మండలిలో ఒక్కరోజు అయినా హుందాగా ప్రసంగం చేశారా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. సిగ్గులేకుండా కౌన్సిల్‌లో సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తూ దొరికిన వ్యక్తివి నువ్వు కాదా అని వెల్లంపల్లి మండిపడ్డారు. ఏం పీకలేరు అన్నమాటను గతంలో అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అన్నారని త్వరలో లోకేశ్‌ను కూడా చంద్రబాబు పరామర్శించే రోజులు దగ్గరలో వస్తాయని వెల్లంపల్లి హెచ్చరించారు. 

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేశ్‌కు లేదని అవాకులు-చెవాకులు మాట్లాడటం సరికాదని వెల్లంపల్లి హెచ్చరించారు. లోకేశ్ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీని సింగిల్ డిజిట్‌కు మిగిలిపోతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios